ఆరేళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పండి

ఆరేళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పండి

హైదరాబాద్ లో గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధిపై ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. GHMC ఎన్నికల్లో భాగంగా TRS  చేసిన అభివృద్ధిపై ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ ప్రగతిని నివేదించాల్సిన బాధ్యత మనపై ఉందని అభ్యర్థులకు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశామని విషయాన్ని ఇంటింటికి వెళ్లి అందరికీ తెలియజేయాలన్నారు. నగరంలోని మొత్తం 150 డివిజన్లలో సగం డివిజన్లు మహిళలకు ఇవ్వాలని సీఎం చట్టం తెచ్చారని, అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశామని చెప్పారు. 85 డివిజన్లు మహిళలకే కేటాయించామన్నారు. ఎస్సీలకు 10 సీట్లే రిజర్వ్‌ అయినా 13 కేటాయించిన ఘనత TRSకే దక్కుందన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించామని తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందున TRS అభ్యర్థులు బీ ఫామ్‌ సమర్పించిన తర్వాతనే జనంలోకి వెళ్లాలని కేటీఆర్‌ సూచించారు. అంతేకాదు బీ ఫామ్ దక్కని అభ్యర్ధి ఇంటికి  వెళ్లి…ఆయన్ను కలుపుకుని ప్రచారం నిర్వహించాలన్నారు.

సమర్ధవంతమైన నాయకుడు కేసీఆర్ అని…ఆయన సీఎం అయిన తర్వాత నీటి, కరెంట్ కష్టాలు తీరాయన్నారు మంత్రి కేటీఆర్. 1920లో గండిపేట రిజర్వాయర్‌ నిర్మాణం జరిగిందన్నారు. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదని చెప్పారు. హైదరాబాద్‌లో కేశవాపురం రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టామని… ఆరు నెలల్లో కేశవాపురం రిజర్వాయర్‌ నీళ్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. 2050 వరకు తాగునీటికి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. విశ్వాసంతో మీకోసం పనిచేసిన TRS ప్రభుత్వం కావాలా…విద్వేశంతో కూడిన హైదరాద్ కావాలా అని ప్రచారం కోసం వెళ్లినప్పుడు ప్రజలను అడగాలని అభ్యర్థులకు సూచించారు మంత్రి కేటీఆర్. కరోనాతో ఇబ్బంది పడిన ప్రజలను ఆదుకున్నాం…వారిని తమ సొంత ప్రాంతాలకు ప్రభుత్వ ఖర్చుతో తరలించామని తెలిపారు.

TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో పేకాట, గుడుంబా క్లబ్లులు మూతపడ్డాయని, రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో రూ.2లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణకు ఆర్థిక ఇంజిన్‌ హైదరాబాద్‌ అన్నారు.

హైదరాబాద్ ను వరద ముంచెత్తితే…అన్ని ప్రాంతాలను తిరిగి పరిశీలించి..వరద బాధితులకు సాయం అందించామన్నారు. కేంద్రం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. మోటారు వెహికిల్ చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం…ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం పోలీసులు వేసిన చలాన్లను జీహెచ్ఎంసీ చెల్లిస్తుందని చెప్పడం దారుణమన్నారు. బండి సంజయ్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకే ఎందుకు వెళ్లారు…ఇంకా నగరంలో ఎక్కడా టెంపుల్స్ లేవా అని అన్నారు. 28న ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపిన కేటీఆర్…ఈ సారి 100 సీట్లు సాధించాలని అభ్యర్థలకు సూచించారు. ఆ తర్వాత అభ్యర్ధులతో ప్రతిజ్ఞ చేయించి.. బీ ఫామ్స్ అందించారు మంత్రి కేటీఆర్.