తెలుగు బిగ్ బాస్: అడవిలో ఆగమాగం

తెలుగు బిగ్ బాస్: అడవిలో ఆగమాగం

బిగ్‌బాస్‌ ఆరో సీజన్ మూడో వారానికి చేరుకుంది. రోజురోజుకీ ఇల్లు మరింత వేడెక్కుతోంది. మరీ డల్‌గా ఉంటున్నారంటూ నాగార్జున తీసుకున్న క్లాస్‌ కాస్త ఓవర్ చేంజ్ తీసుకొచ్చినట్టుంది. ఆడేది తక్కువ అరుచుకునేది ఎక్కువ అయిపోయింది. ఇవాళ్టి ఎపిసోడ్‌ కూడా కూల్‌గానే మొదలైనా.. కాసేపటికి అరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లిపోయింది. 

నామినేషన్ రచ్చ.. ఆగని చర్చ

ఎలిమినేషన్ కోసం నామినేషన్లు వేసేటప్పుడు మొదలైన హీట్ ఓ పట్టాన చల్లారలేదు. ప్రక్రియ పూర్తయ్యాక కూడా దాని గురించే చాలా చర్చలు నడిచాయి. అవసరమైనప్పుడు అరిచేసి, ఆ పైన దాని గురించి తలచుకుని మరీ ఏడ్చేసే నేహ మరోమారు ఆ సీన్‌ని రిపీట్ చేసింది. రేవంత్‌ అలా చేస్తాడని నేను ఊహించలేదు అంటూ బావురుమంది. ఆ తర్వాత అర్జున్‌తో కూడా వసంతిని నామినేట్ చేయడం గురించి పంచాయతీ పెట్టింది. అటు రేవంత్ కూడా నేహ తీరును తప్పుబడుతూ మాట్లాడాడు. ఆరోహి ఆట ఆడే విధానం కరెక్ట్ కాదని చంటి వెళ్లి నేరుగా సూర్యకే చెబుతున్నాడు. నా గురించిన పాయింట్ నువ్వెందుకు రెయిజ్ చేశావంటూ కీర్తికి రాజ్ క్లాస్ తీసుకున్నాడు. ఇక గీతూ, ఆదిరెడ్డి మళ్లీ రివ్యూ చేయడం మొదలెట్టారు. ఇనయా అన్నింట్లోనూ దూరిపోతుంది ఎవరినీ మాట్లానివ్వదు అని ఆది అన్నాడో లేదో గీతూ వెంటనే అందుకుంది. అవును, ఆ పిల్ల ఎవరినీ మాట్లానివ్వదు అంటూ తానేదో చాలా కూల్ అన్నట్టుగా గీతూ ఆజ్యం పోసింది. ఆమె ఓ పిచ్చిది అని ఆది అనగానే పకపకా నవ్వింది. మొత్తానికి నామినేషన్ల సమయంలో జరిగినదాన్నయితే ఎవ్వరూ అంత తేలికగా తీసుకోలేదు.

అడవంతా ఆగమాగం చేసిండ్రు

ఎలిమినేషన్ల కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. కెప్టెన్సీ కోసం పోటీ మొదలైంది. నిజానికి ఇది పోటీ కాదు.. పోరాటమే. అసలే నామినేషన్స్ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లు.. ఇప్పుడీ టాస్క్ కోసం యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా తయారయ్యారు. విజయమో వీర స్వర్గమో అన్న రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అసలు ఆటేంటంటే.. ఓ అడవి. అందులో విలువైన వస్తువులు ఉంటాయి. వాటికి కొందరు పోలీసులు కాపలాగా ఉంటారు. ఓ పక్షి అరిచినప్పుడల్లా ఐదుగురు దొంగలు అడవిలో చొరబడి వాటిని కొట్టేస్తారు. అలా జరగకుండా పోలీసులు అడ్డుకోవాలి. దొంగలు తాము దొంగిలించిన వాటిని అత్యాశ కలిగిన వ్యాపారి అయిన గీతూకి అమ్మాల్సి ఉంటుంది. ఆట ముగిసే సమయానికి ఎవరి దగ్గర ఎక్కువ వస్తువులు, డబ్బులు ఉంటాయో వాళ్లే విజేతలు. ఇదే గేమ్. ఆట మొదలవుతూనే రంగంలోకి దిగారంతా. దొంగలు ఎగబడ్డారు. పోలీసులు వాళ్లకి అడ్డుపడ్డారు. వెంటపడి వెంటపడి తరిమారు. కొందరిని జైల్లో కూడా వేశారు. పోలీస్ అయిన బాలాదిత్య తన కాలు పట్టుకుని కదలకుండా చేశాడని, ఆడనివ్వలేదని దొంగ నేహ మరోసారి ఏడుపందుకుంది. గీత దాటొచ్చి మరీ తన దగ్గర బొమ్మ లాక్కున్నారని, రూల్‌ని పాటించలేదని శ్రీహాన్ ఫైర్ అయ్యాడు. ఇక సూర్య, శ్రీసత్య కూడా ఇవాళ వాయిస్ బాగా రెయిజ్ చేశారు. మొత్తానికి ఎవరి స్టైల్లో వాళ్లు ఆడటానికి ట్రై చేస్తూ అడవంతా ఆగమాగం చేసి పారేశారు.

నోరు జారనేల ఇనయా!

ఎదుటివాళ్లను మాట్లాడనివ్వకుండా మధ్యలో దూరిపోయి అరిచేయడం.. నోటికి ఏదొస్తే అది అనేసి నేను అనలేదు అని ఫ్లిప్ అయిపోవడం అలవాటుగా మారిపోతోంది ఇనయాకి. నిన్న నామినేషన్ టైమ్‌లో ఎవ్వరినీ తమ రీజన్స్ చెప్పనివ్వకుండా అరిచేసి రచ్చరచ్చ చేసింది. ఇవాళేమో శ్రీహాన్‌ గురించి మర్యాద లేకుండా మాట్లాడి గొడవ రేపింది. ఓ విషయంలో పోలీస్‌ టీమ్‌లో ఉన్న ఇనయా.. దొంగల టీమ్ మెంబర్ అయిన శ్రీహాన్ గురించి మిగతావారికి కంప్లయింట్ చేయడం మొదలెట్టింది. మెల్లగా వాదన పెరిగింది. దాంతో ఇనయా వాడు, వాడు అని శ్రీహాన్‌ని ఒకటికి రెండుసార్లు సంబోధించింది. దాంతో అతను తిరగబడ్డాడు. మర్యాదగా మాట్లాడు, నోరు జారకు అంటూ అరిచాడు. వెంటనే ఇనయా నేనలా అనలేదు అంటూ మాట మార్చేసింది. నువ్వు అన్నావంటూ శ్రీహాన్ ఫైర్ అయ్యాడు. అంతలో రేవంత్ కల్పించుకుని దానితో ఏంటి మాటలు, వేస్ట్ అంటూ శ్రీహాన్‌ని తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. వాడు అంటోంది అని అతను చెప్పడంతో రేవంత్ కూడా రెచ్చిపోయాడు. మొన్న నన్ను అంది, ఇప్పుడు నిన్ను అంటోంది, నన్ను అన్నప్పుడే ఒక్కటిచ్చి ఉండాల్సింది అంటూ కేకలేశాడు. అసలే గొడవ పడటానికి వంకలు వెతుక్కునే ఇనయా ఇక అతని మీద అరవడం స్టార్ట్ చేసింది. కొడతావా కొట్టు, ఎలా కొడతావో కొట్టు చూస్తాను అంటూ పదే పదే రెచ్చగొట్టింది. రేవంత్ అంత పని చేయలేదు కానీ.. ‘మర్యాదగా మాట్లాడటం చేత కాదా, మీ ఇంట్లోవాళ్లు నీకు సంస్కారం నేర్పలేదా’ అంటూ మండిపడ్డాడు. బహుశా దీనికి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున రియాక్షన్ కాస్త ఘాటుగానే ఉండొచ్చు. వాడు అన్నందుకు ఇనయాని.. దానితో మాటలేంటి అన్నందుకు, సంస్కారం నేర్పలేదా అంటూ ఇంట్లోవాళ్లని లాగినందుకు రేవంత్‌కి కూడా అక్షింతలు పడే అవకాశం ఉంది. 

గీతూతో గట్లనే ఉంటది మరి!

మామూలుగానే ఫైర్ బ్రాండ్‌లా ఉండే గీతూ.. టాస్కుల టైమ్ వచ్చేసరికి విశ్వరూపం చూపిస్తూ ఉంటుంది. ఆమె తెలివికి, జోష్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలనిపించినా.. మరీ దారుణంగా తొండి ఆడేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇవాళ కూడా ఆమె అదే చేసింది. ఓపక్క అందరూ ఆట ఎలా ఆడాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉండగానే దొంగ పనులు మొదలెట్టేసింది. ఇక ఆట మొదలయ్యాక అతి తెలివితేటలతో అందరికీ పిచ్చెక్కించింది. దొంగలు కష్టపడి సంపాదించుకున్న వస్తువుల్ని కొట్టేసి దాచేసుకుంది. అరోహి ఇచ్చిందంటూ మొదట చెప్పి తర్వాత మాట మార్చేయడంతో అబద్ధాలు చెప్పొద్దంటూ బాలాదిత్య, శ్రీసత్య వారించారు. నువ్వు అలా కొట్టేయకూడదు, కొనుక్కోవాలి అని ఎంత చెప్పినా, ఎంతమంది చెప్పినా తగ్గేదే లే అంది. నేనిట్టాగే ఆడతా, ఏం చేసుకుంటే అది చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో శ్రీసత్య ఫైర్ అయ్యింది. ఆమె రూల్స్ ఆమే రాసుకుంటుంది, ఇక మేమెందుకు ఆడటం, మొత్తం ఆమెనే ఆడుకోమనండి అంటూ బిగ్‌బాస్‌తో అంది సత్య. పోయినసారి కూడా ఇలాగే దొంగాట ఆడావ్, అయినా నీకు క్లాప్స్ కొట్టారు కదా, ఈసారి కూడా కొడతారులే అంటూ గీతూ మీద కూడా మండిపడింది. విశేషమేమిటంటే కలిసి కూర్చుని అందరినీ జడ్జ్ చేయడంలో బిజీగా ఉండే ఆదిరెడ్డి, గీతూ ఈసారి ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఆది పోలీసు టీమ్‌కి హెడ్. అందుకే గీతూ దొంగాట ఆడటాన్ని వ్యతిరేకిస్తూ ఆమెని విసిగించాడు. కానీ గీతూ ముందు ఎవరూ నిలబడలేరు కదా! ఎవరేమన్నా ఆమె లెక్క చేయదుగా! తన ఆట తను ఆడుకుంది. శ్రీహాన్‌ని మేనిప్యులేట్ చేసి కొన్ని వస్తువులు తనకి అమ్మేలా కూడా చేసింది.

ఇవాళ్టికైతే ఆట సమయం ముగిసింది. కానీ రేపు ఈ ఆట వేటగా మారబోతున్నట్టు కనిపిస్తోంది. గీతూకి, మిగతా దొంగలకి కాస్త గట్టిగానే గొడవ జరిగేలా ఉంది. చివరికి పోలీసులది పై చేయి అవుతుందా.. దొంగలకే విజయం లభిస్తుందా.. లేక గీతూనే ఏదో ఒక గలాటా చేసి క్రెడిట్ పట్టుకుపోతుందా.. చూడాలి మరి.