తెలుగు బిగ్బాస్: హోటల్ టాస్క్లో బెస్ట్ ఎవరు ?

తెలుగు బిగ్బాస్: హోటల్ టాస్క్లో బెస్ట్ ఎవరు ?

హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ పూర్తయ్యింది. ఇందులో బెస్ట్ అనిపించుకున్నవారు కెప్టెన్సీ పదవి కోసం పోటీ పడతారు. అయితే వాళ్లు ఎవరన్నది బిగ్‌బాస్ రివీల్ చేయలేదు. సమయం వచ్చినప్పుడు చెబుతానన్నాడు. మరి ఆయన ఎవరి పేర్లు చెప్పాడు? ఇవాళ్టి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్కుల్లో ఎవరు పాల్గొన్నారు?

ఫైమా వెక్కిళ్లు.. గీతక్క కన్నీళ్లు

ఏడిపించడమే తప్ప ఏడవడం రాదు అన్నట్టు ఉండే గీతక్క.. హోటల్ టాస్క్ పుణ్యమా అని కన్నీళ్లు పెట్టేసుకుంది. అంత ఎమోషన్‌లోనూ కళ్లలో తడి కెమెరాలకు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త కూడా పడింది. మంచమ్మీద పడుకుని, దుప్పట్లు కప్పేసుకుని మరీ హోటల్ టాస్క్ గురించి గీతూ, ఫైమాలు డిస్కషన్ పెట్టుకున్నారు. రాజ్ మనోడే కదా అనుకున్నాను, కానీ అతనే దెబ్బేశాడు అంటూ ఫైమా ఫీలైపోయింది. కనీసం ఒక్క వంద కూడా ఇవ్వలేదంటూ గుక్కపెట్టింది. దాంతో గీతూ కూడా తన బాధని బయటపట్టింది. తన విషయంలోనూ అలాగే జరిగిందని, ఎంతో క్లోజ్‌గా సొంత మనిషిలా ఉండేవాళ్లే ఇలా చేయడం అన్యాయమని ఎమోషనల్ అయిపోయింది. మన గురించి మనం ఆలోచించకుండా వాళ్లు బాగుండాలని ఆలోచిస్తున్నాం, వాళ్లు మాత్రం హ్యాపీగా ఉన్నారు అంటూ ఏడ్చేసింది. జోక్ అంటే ఇదే. గీతూ అసలు ఎప్పుడైనా ఎవరి గురించైనా ఆలోచిస్తుందా? ఎదుటివాళ్ల కోసం ఆడుతుందా? ఆటలో అమ్మానాన్నా ఉన్నా కూడా ఓడించే తీరతానని నాగార్జునతోనే చెప్పేసింది కదా. మరి ఆమె వేరేవాళ్ల గురించి ఆలోచించడం ఏంటో. ఏదేమైనా గడుసుపిల్ల గీతూ ఇలా ఏడవడం మాత్రం చూడటానికి కాస్త కొత్తగానే అనిపించింది.

ఇదేం లాజిక్ ఇనయా!

ఆదిరెడ్డి, గీతూలు సరిపోరనుకుంటోందో ఏమో.. ఇనయా కూడా రివ్యూలు మొదలెట్టింది. హౌస్‌లో ఉండేదెవరు, ఈవారం వెళ్లేదెవరు అంటూ జోస్యాలు చెబుతోంది. అది కూడా తనని నామినేట్ చేసిన రోహిత్, మెరీనాల దగ్గర కూర్చుని. నాకు తెలిసినంతవరకు రాజ్‌ డేంజర్ జోన్‌లో ఉన్నాడు, ఈవారం తనే వెళ్లిపోతాడు అని వాళ్లతో అందామె. వెంటనే రోహిత్.. మరి అర్జున్ వెళ్లడా అంటూ అమాయకంగా అడిగాడు. అతను వెళ్లడు, శ్రీసత్యతో రొమాంటిక్ ట్రాక్ మొదలు పెట్టాడు కనుక చివరి వరకు దాన్ని కొనసాగిస్తారు అంటూ బిగ్‌బాస్ వాళ్లను బైటికి పంపరని తనకి తెలిసినట్టుగానే చెప్పింది. వాళ్ల రొమాన్స్ క్లిక్ అయితే వాళ్లకి ఓట్లు పడతాయని కూడా అంది.

ఫైమాకి అందరినీ ఓ ఆటాడించే అవకాశం వచ్చినా సరిగ్గా ఉపయోగించుకోలేదని, వాసంతి డ్యాన్స్ బాగా చేసి ఎంటర్‌‌టైన్ చేసిందని, రాజ్‌గాడు హ్యాండిచ్చాడని.. ఇలా తనదైన శైలిలో రివ్యూలు ఇచ్చుకుంటూ పోయింది. ఇనయా తీరే అంత. ఆమెకి ఎవరు నచ్చుతారో వాళ్లని తెగ వెనకేసుకొస్తుంది. నచ్చనివాళ్ల గురించి చెప్పీ చెప్పనట్టు ఏవేవో మైనస్ పాయింట్లు చెబుతుంది. అర్జున్, శ్రీసత్యల రొమాన్స్ ప్రస్తావన అందుకే తెచ్చింది. నిజానికి టాస్క్ జరుగుతున్నంతసేపు అర్జున్ ఏం అడిగినా చేసిన శ్రీసత్య.. అది అవ్వగానే నార్మల్ అయిపోయింది. అర్జున్ ఏదో బిస్కట్ వేయబోతే.. ఇక చాల్లే, టాస్క్ అయిపోయింది ఆపెయ్ అని చిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది. మరి వాళ్ల విషయంలో ఇనయా లాజిక్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.

ఆరోహి యాక్షన్.. సూర్య రియాక్షన్

ఆట సంగతేమో కానీ ఆరోహి, సూర్యల పంచాయతీలే ఎక్కువైపోతున్నాయి హౌస్‌లో. ఇవాళ ఇద్దరూ అన్నం తినడానికి టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇద్దరి ముందూ ప్లేట్లు ఉన్నాయి. కానీ ఆరోహి తన కంచంలో చేయి పెట్టడం లేదు. సూర్యనే తాను తింటూ ఆమెకి తినిపిస్తున్నాడు. ఈ వ్యవహారమే చూడ్డానికి తలనొప్పి వస్తోంది అంటే.. ఆరోహి అలవాటు ప్రకారం ఓ టాపిక్ లేవనెత్తింది.

ఎంతసేపూ నీకు నేనే ముఖ్యమని నువ్వు గుర్తించాలి అన్నట్టే మాట్లాడుతుంది కదా. సూర్యకి తిక్క రేగి తన స్టైల్లో జవాబు చెప్పాడు. అంతే.. ఎప్పట్లాగే అలిగి వెళ్లిపోయింది. సూర్య వెంటనే తినడం ఆపేసి, లేచి వెళ్లి అన్నమంతా డస్ట్ బిన్‌లో పడేశాడు. ఆ తర్వాత మళ్లీ దీని గురించి పంచాయితీ మొదలైంది. ఫుడ్‌ని వేస్ట్ చేసుకుంటావా, అలా పడేయడం ఏంటి, ఇది మైనస్ అవుతుంది కదా అంటూ మొదలుపెట్టింది. మొత్తంగా ఈమెకి ఏదో ఒక విషయంపై సూర్యతో చర్చలు నడపడమే పనైపోయింది. అది కూడా ఎంతసేపూ ఒకే టైప్ సంభాషణ కావడంతో చూడటానికి చిరాకొస్తోంది. వీళ్లకి ఇంకేం పని లేదా అనిపిస్తోంది. పైగా ఈమధ్య సూర్య కొత్తగా సోలో పర్‌‌ఫార్మెన్స్ కూడా మొదలెట్టాడు. కెమెరాల్లో చక్కగా పడే ప్లేస్ చూసుకుని ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. ఎమోషనల్‌గా మాట్లాడుతున్నానని అనుకుంటున్నాడు కానీ అదంతా ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తున్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

రేవంత్‌ ఆడేది తక్కువ, ఎలా ఆడుతున్నాను అని అందరినీ అడిగేది ఎక్కువ అయిపోయింది. నా గేమ్ ఎలా ఉంది అంటూ తన గురించి మాట్లాడే చాన్స్ ఇవాళ శ్రీహాన్‌కి ఇచ్చాడు. నిన్న ఎందుకో కాస్త డల్ అయ్యావు, ఏడ్చావని కూడా ఎవరో చెప్పారు అంటూ అతను ఓ రిప్లై పడేశాడు. ఇక దొరికిందే చాన్స్ అన్నట్టు అమ్మ గుర్తొచ్చింది అంటూ అమూల్‌ బేబీలా సెంటిమెంట్ కుమ్మరించడం మొదలుపెట్టాడు రేవంత్.

ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రేవంత్ ప్రతిదానికీ ఎమోషనల్ అవ్వడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత కాసేపటికి అతని భార్యకి సీమంతం జరిగిన విషయాన్ని రేవంత్‌కి చెప్పిన బిగ్‌బాస్.. టీవీలో ఆ వీడియో బైట్స్ చూపించారు.

అక్కడ ఉన్న వస్తువుల్లోంచి కొన్ని సెలెక్ట్ చేయమని, వాటిని అతని వైపు నుంచి ఆశీర్వాదంలా అతని భార్యకు పంపుతామని చెప్పాడు. అలాగే చేసిన రేవంత్ భార్య కోసం భోరుమన్నాడు. కాసేపటికి తేరుకుని తనకి ఇది చాలని, ఇక ఆడి చూపిస్తానని, విన్నర్‌‌గా నిలిచి కప్పు తీసుకెళ్లి తన బిడ్డ చేతిలో పెడతానని ఆవేశంగా చెప్పాడు. అతను ఇలా స్ట్రాంగ్‌గా కనిపించినప్పుడు చూడటానికి ఇష్టంగానే అనిపిస్తోంది. కానీ చేసిన శపథాలు క్షణాల్లో మర్చిపోయి డీలా పడిపోవడం చూస్తేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏదేమైనా ఇవాళ్టి ఎపిసోడ్‌ని రేవంత్ భార్య సీమంతం స్పెషల్‌గా మార్చింది. 

నచ్చితేనే కెప్టెన్

ఇక కెప్టెన్సీ కుర్చీ కోసం పోరు మొదలైంది. గార్డెన్ మధ్యలో ఉన్న టేబుల్ మీద ఓ గ్లవుజు పెట్టారు. బజర్ మోగగానే పోటీదారులంతా వెళ్లి దాన్ని దక్కించుకోడానికి ట్రై చేయాలి. ఎవరి చేతికి గ్లవుజ్ దొరికితే వాళ్లు అక్కడ వరుసగా ఫొటోలు పెట్టివున్న కంటెండర్లలో ఎవరికి కెప్టెన్ అవడానికి అర్హత లేదని అనుకుంటున్నారో వాళ్ల ఫొటోకి పంచ్ ఇవ్వాలి. ముందుగా గ్లవుజ్‌ దొరికినవాళ్లు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఇదీ గేమ్. ముందుగా రేవంత్ గ్లవుజ్‌ని దక్కించుకున్నాడు. అతనే సంచాలకుడు అయ్యాడు.

తర్వాత అందరూ పోటీపడ్డారు. ఒక్కొక్కళ్లూ ఒక్కొక్కరిని పోటీ నుంచి తొలగించారు. నువ్వు ఎలిమినేషన్‌లో లేవు కాబట్టి నీకు మళ్లీ కెప్టెన్ అయ్యే చాన్సుంది, అందుకే నిన్ను తీసేస్తున్నాను అని బాలాదిత్య చెప్పడంతో ఫైమా బాగా హర్టయ్యింది. ఇలా ఎలా చేస్తావంటూ అతనితో చర్చలు మొదలెట్టింది.

చంటి తనని తొలగించడం నచ్చక గీతూ కూడా నోరు పారేసుకుంది. కెప్టెన్ అయ్యేవాళ్లు అందరితో ప్రేమగా ఉంటూనే పనులు చేయించుకోవాలని, ఆ లక్షణం గీతూలో కాస్త తక్కువని చంటి పొలైట్‌గానే చెప్పాడు. కానీ గీతూ మాత్రం ‘ఆట ఆడటం రానివాళ్లు కూడా నా ఆట గురించి మాట్లాడటం కామెడీగా ఉంది’ అంటూ ఎగతాళి చేసింది. దాంతో చంటి రివర్సయ్యాడు. ఆట గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్, నేను అన్నది వేరే అని ఎంత చెప్పినా గీతూ ఒప్పుకోలేదు. లోపలికెళ్తూ, బైటికొస్తూ, ఏదో ఒకటి అంటూ తన స్టైల్లో గలాటా చేసింది. చంటి కూడా ఎక్కడా తగ్గలా మాటకి మాట ఇచ్చేశాడు. ఈమెకి తెలిసిందే ఆట అనుకుంటోంది, అసలు ఆట ఇంకా మొదలవ్వలేదు అంటూ రేవంత్, బాలాదిత్యలతో చెబుతున్నాడు. ఆ ఆటేదో చంటి త్వరగా మొదలుపెడితే బాగుంటుందేమో కదా!

ఏదేమైతేనేం.. ఇవాళ్టికి ఆట ముగిసింది. మిగతా ఆట తర్వాతి ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాం, ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోమన్నాడు బిగ్‌బాస్. ఈ గ్లవుజ్ టాస్క్‌ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. రెండో రౌండ్‌లో మరో కొత్త ఆట ఆడాల్సి ఉంటుంది. ప్రోమోని బట్టి రేపు హౌస్‌ భగ్గుమనేలానే కనిపిస్తోంది. ఎందుకో, అసలు చివరికి ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి మరి.