నితీష్ రెడ్డి, తిలక్ వర్మ, సిరాజ్.. ముగ్గురు మొనగాళ్లు

నితీష్ రెడ్డి, తిలక్ వర్మ, సిరాజ్.. ముగ్గురు మొనగాళ్లు

టీమిండియా క్రికెట్లో తెలుగు కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. కీలక సమయాల్లో ప్లేయర్లంతా చేతులెత్తేసిన సందర్భాల్లో ఇంద్ర సినిమాలో బుడ్డోడిలా ‘టీమిండియాకు మేమున్నాం’ అని బరిలోకి దూకేసి సత్తా చాటుతున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యా్చ్లో ఏం జరిగిందో చూశాం. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాక్‌‌‌‌ మిడిలార్డర్ బ్యాటర్లు తడబడితే.. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ఇండియా అనూహ్యంగా ఆరంభంలోనే  ఇబ్బంది పడింది. స్కోరు బోర్డుపై 20 రన్స్ చేరేలోపే టాప్‌‌‌‌–3 బ్యాటర్లు వెనక్కు వచ్చేశారు. భీకర ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (5) ఆఖరాటలో ఫెయిలయ్యాడు. రెండో ఓవర్లో  ఫహీమ్ అష్రఫ్  స్లో బాల్‌‌‌‌ను సిక్స్‌‌‌‌ కొట్టేందుకు ట్రే చేసి రవూఫ్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. టోర్నీలో పేవల ఫామ్‌‌‌‌ను కొనసాగించిన కెప్టెన్ సూర్యకుమార్ (1).. షాహీన్ బౌలింగ్‌‌‌‌లో కెప్టెన్ సల్మాన్‌‌‌‌కు చిక్కి నిరాశ పరిచాడు. ఈ డబుల్ షాక్స్ నుంచి తేరుకునేలోపే అష్రఫ్ మరో దెబ్బకొట్టాడు. 

నాలుగో ఓవర్లో మిడాన్ మీదుగా షాట్ ఆడిన శుభ్‌‌‌‌మన్ గిల్ (12).. రవూఫ్ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌కు పెవిలియన్ చేరడంతో ఇండియా 20/3తో కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులొకొచ్చాడండీ మన హైదరాబాద్ కుర్రాడు. ఫహీమ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో 4, 6తో తిలక్ ఛేజింగ్‌‌‌‌కు జోష్ తీసుకొచ్చాడు. చివరి 36 బాల్స్‌‌‌‌లో ఇండియాకు 64 రన్స్ అవసరం పడ్డాయి. ఒత్తిడి పెరిగింది. ఇక విజయమో.. వీర స్వర్గమో అనే తరహాలో తిలక్ వర్మ బ్యాట్ ఝుళిపించాడు. సిక్స్, ఫోర్ కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో తిలక్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రవూఫ్ వేసిన చివరి ఓవర్లో తిలక్ భారీ సిక్స్‌‌‌‌, రింకూ సింగ్ (4 నాటౌట్‌‌‌‌) ఫోర్‌‌‌‌‌‌‌‌తో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఆసియా కప్ టీమిండియా వశమైంది.

ఇక నితీష్ కుమార్ రెడ్డి విషయానికొస్తే.. భారత్, ఆస్ట్రేలియా మధ్యన జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై టెస్ట్ అరంగ్రేటం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఎలాంటి బెరుకు లేకుండా తొలి సిరీస్‏లోనే రాణించాడు. ఈ టోర్నీలో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ తన అద్భుత ప్రదర్శనతో నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి జట్టు ఆపదలో ఉన్న సమయాల్లో ఆదుకున్నాడు. మరీ ముఖ్యంగా మెల్‎బోర్న్ వేదికగా ప్రతిష్టాత్మ ఎంసీజీ స్టేడియంలో జరిగిన టెస్ట్‎లో నితీష్ రెడ్డి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమై జట్టు పీకల్లోతూ కష్టాల్లో ఉండగా.. నేనున్నాంటూ నితీష్ టీమిండియాను ఆదుకున్నాడు. నిప్పులు చెరిగే ఆసీస్ బౌలర్ల బంతులను ఎంతో అనుభవం గల ఆటగాడిలా ఎదుర్కొంటూ జీవితాంతం గుర్తుండిపోయేలా సెంచరీ చేసి భారత్‎ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ టెస్ట్‎లో భారత్ ఓటమి పాలైనప్పటికీ.. నితీష్ రెడ్డి పేరు మాత్రం మారుమోగిపోయింది. 

మరో హైదరాబాదీ సిరాజ్ గురించి చాలాసార్లు తన సత్తా ఏంటో బంతితోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఓవల్‌‌లో ఓటమి అంచున ఉన్న టీమిండియా జట్టును ఒంటి చేత్తో గెలిపించిన సిరాజ్‌ తను వర్క్‌‌హార్స్‌‌ మాత్రమే కాదు గేమ్-ఛేంజర్ అని నిరూపించాడు. బుమ్రా గైర్హాజరీలో ఇండియా బౌలింగ్ పదును తగ్గుతుందేమోనని భయపడిన వేళ సిరాజ్ నేనున్నానని ముందుకొచ్చాడు. ఆ బాధ్యతను కేవలం స్వీకరించడం కాదు, దానిని శాసించాడు. చేతికి అందిన కొత్త బంతికి తన ఆవేశాన్ని, ఆత్మవిశ్వాసాన్ని జోడించి ప్రత్యర్థికి సవాల్ విసిరాడు. సిరాజ్ ఎవరినీ అనుకరించడానికి ప్రయత్నించడం లేదు. తను బుమ్రాలా ప్రశాంతంగా ప్రత్యర్థిని దెబ్బతీసే కిల్లర్ కాదు. షమీలా నిశ్శబ్దంగా శ్రమించే యోధుడు కాదు. అతను వేసే బంతుల్లో ఓ ఎమోషన్‌..  ఓ విధ్వంసం కనిపిస్తుంది.

కేవలం వ్యూహంతోనే  కాకుండా తన హృదయంతో బౌలింగ్ చేసి ఫలితం సాధిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు విజయానికి 35 రన్స్‌ దూరంలోనే ఉంది. మరో 4 వికెట్లు పడగొడితేనే మనం గెలుస్తాం. అలాంటి క్లిష్ట సమయంలో సిరాజ్ టీమిండియాకు పెట్టని గోడలా నిలబడ్డాడు. నాలుగు వికెట్లలో మూడు పడగొట్టి సిరాజ్‌‌ హీరోగా నిలిచాడు. మ్యాచ్‌‌ మొత్తంలో 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్​ద మ్యాచ్‌‌గా నిలిచాడు. ఇలా టీమిండియా జట్టుకు తప్పనిసరి అవసరం ఏర్పడిన ప్రతీ సందర్భంలో మన తెలుగు కుర్రాళ్లు చిచ్చర పిడుగుల్లా రాణిస్తున్నారు. టీమిండియా జట్టును విజయతీరాలకు చేరుస్తున్నారు.