
రెండు రాష్టాలకు సంబంధించిన ఫిలిం ఎగ్జిబిటర్లతో తెలుగు చలనచిత్ర నిర్మాతలు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీపీఎఫ్ ఛార్జీలు నిర్మాతలే భరించాలని ఎగ్జిబిటర్లు కోరారు. ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారానికి నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించింది. ఎగ్జిబిటర్ల సమస్యలపై దర్శకుడు తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు సినీ కార్మికుల వేతనంపై కూడా నిర్మాతల మండలి చర్చలు జరిపింది. వేతన సవరణ గురించి ఫెడరేషన్ నాయకులు నిర్మాతల మండలితో చర్చించారు. ఎగ్జిబిటర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు 1-09-2022 నుంచి అమలయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి వెల్లడించింది.
కరోనా తర్వాత తెలుగు సినిమా రంగం కుదేలైంది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటుందనుకున్నా.. తెలుగు చిత్రసీమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. నిర్మాణ వ్యయం, రెమ్యునరేషన్, వీపిఎఫ్ ఛార్జీలు, ఓటీటీ విడుదలలు వంటి సమస్యలు పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా చర్చించిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి.. షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సోమవారం నుంచి సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. తెలుగు చిత్ర పరిశ్రమపై బంద్ పాక్షిక ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. కొన్ని చిత్రాల షూటింగ్లు పూర్తిగా ఆగిపోగా... కొన్ని మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి.