మన ఎకానమీకి ఏమీ కాదు

మన ఎకానమీకి ఏమీ కాదు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రస్తుతం ఇండియాతోపాటు అన్ని దేశాలనూ వణికిస్తున్న కరోనా, ఎకానమీ క్రైసిస్‌‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుగు ఇండస్ట్రియలిస్టులు అంటున్నారు. కరోనా ప్రమాదకర వైరసే అయినా, తగిన జాగ్రత్తలు పాటిస్తే దాని బారినపడకుండా కాపాడుకోవచ్చని అన్నారు. కరోనాను అడ్డుకోవడంతోపాటు ఎకానమీని నిలబెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని అన్నారు. అయితే కొన్ని రాష్ట్రాలు టెస్టులను తక్కువగా నిర్వహిస్తున్నాయని, వీటిని పెంచాలని అమెరికాలోని తెలుగు ఇండస్ట్రియలిస్టులు చెప్పారు. ఇటీవల తెలుగు ఎంటర్‌‌ప్రిన్యూర్స్‌‌ అసోసియేషన్‌‌ (డాలస్‌‌) నిర్వహించిన ‘బిఫోర్, ఆఫ్టర్ కరోనా అండ్ ఎకానమీ’ పేరుతో వెబినార్‌‌లో వీళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.

అందరికీ టెస్టులు అవసరం లేదు…

కరోనా వీక్‌‌ వైరస్‌‌..కానీ స్మార్ట్‌‌ వైరస్‌‌. అంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సోకుతుంది. ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. వ్యాధి సోకిన వారిలో 80 శాతం రోగులకు ఏమీ కావడం లేదు. కరోనాతోపాటు ఇతర వ్యాధులు ఉన్న వారే మరణించే అవకాశాలు ఎక్కువ. మనం నిత్యం పసుపు, అల్లం, ఉల్లిపాయలు, ధనియాలు వాడుతాం కాబట్టి రోగనిరోధక శక్తి ఎక్కువ . కరోనా, లాక్‌‌డౌన్‌‌.. ఈ రెండింటినీ బ్యాలన్స్‌‌ చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆహారం, వస్తువులు సహా అన్ని చోట్లా వైరస్ ఉంటుంది. ఏది ఏమైనా రోగనిరోధక శక్తి అన్నింటికంటే ముఖ్యం. హైడ్రోక్లోరాక్సిన్ మందు బాగా పనిచేస్తుందని కొందరు చేయడం లేదని కొందరు వాదిస్తున్నారు. వ్యాక్సిన్ అన్ని దశల ప్రయోగాలు పూర్తి కావడానికి దాదాపు 18 నెలల వరకు పట్టొచ్చు. వాక్సిన్ వచ్చినా మ్యుటేషన్ పెరుగుతూనే ఉంది కాబట్టి పోషకాహారంపైనే ఎక్కువ ఆధారపడాలి. ఇమ్యూనిటీని కచ్చితంగా పెంచుకోవాలి.  –ఎం.ఎస్‌‌.రెడ్డి, ఇండస్ట్రియలిస్టు, వైరాలజిస్టు, డాలస్‌‌, అమెరికా

ఎన్నో కొత్త అవకాశాలు ఉన్నాయ్‌‌..

ఇండియాలో కరోనా కేసులు ఎక్కువే అయినా మరణాల శాతం తక్కువ ఉంది. ఇది సంతోషించాల్సిన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోంది. లాక్‌‌డౌన్‌‌ లేకపోతే మరణాలు విపరీతంగా పెరిగేవి. మోడీ ఎప్పటికప్పుడు సీఎంలతో చర్చలు జరుపుతూ కరోనా కట్టడికి బలమైన చర్యలు తీసుకుంటున్నారు. దశలవారీగా లాక్‌‌డౌన్‌‌ ఎత్తేయడం వల్ల ఎకానమీ క్రమంగా పట్టాలెక్కుతోంది. ప్యాకేజీల ద్వారా అన్ని వర్గాలకూ మేలు జరిగింది. పేదలకు ఉచితంగా రేషన్, డబ్బు, గ్యాస్‌‌సిలిండర్లు ఇచ్చారు. అయితే వలస కూలీలను సరిగ్గా ఆదుకోలేదని అసంతృప్తి కొంత ఉంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీతో చిన్న కంపెనీలకు ఎంతో మేలు జరిగింది. మన ఎకానమీ బలమైనది కాబట్టే ఇంతటి కష్టకాలంలోనూ జీడీపీ 4 శాతం నమోదయింది. ప్రభుత్వ సహకారం వల్ల అన్ని సెక్టార్లు పుంజుకున్నాయి. కంపెనీల క్యాష్‌‌ఫ్లోలు పెరిగాయి. రూరల్ మార్కెట్ నుంచి డిమాండ్‌‌ పుంజుకుంది. అర్బన్‌‌ మార్కెట్లు కాస్త డల్‌‌గా ఉన్నాయి. మన ఫారెక్స్ రిజర్వులు బాగున్నాయి. ఆయిల్ ధరలు తగ్గడం కూడా మంచిదే! కరోనా మనకు కొత్త అవకాశాలను ఇచ్చింది. కొత్త పాఠాలను నేర్పించింది. వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌ చేసే అవకాశం వచ్చింది. వ్యాపారాలను మరింత సమర్థంగా ఎలా నిర్వహించుకోవచ్చో ఈ వ్యాధి మనకు నేర్పింది. ఇండియాలో కొత్త వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుంది. ఇండియా ఇటీవల చాలా ఎఫ్‌‌డీఐలను ఆకర్షించడమే ఇందుకు నిదర్శనం. జపాన్, అమెరికా వంటి దేశాలు తమ కంపెనీలను వేరే దేశాలకు తరలించాలని చూస్తున్నాయి. వీటిని ఆకర్షిచండానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు రెడీగా ఉన్నాయి. కచ్చితంగా చాలా ఇన్వెస్ట్‌‌మెంట్లు వస్తాయి.  –డాక్టర్ వివేక్‌‌ వెంకటస్వామి, మాజీ ఎంపీ, విశాక ఇండస్ట్రీస్‌‌ చైర్మన్‌‌

ఆత్మనిర్భర్‌‌ ప్యాకేజీతో ఎన్నో లాభాలు..

ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికే లాక్‌‌డౌన్‌‌ ఎత్తేయాల్సి వచ్చింది. ఎకానమీని పట్టాలెక్కించడానికి ఆత్మనిర్భర ప్యాకేజీని ప్రకటించారు. దీనివల్ల ఎకానమీకి ఎంతో మేలు జరుగుతోంది. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్‌‌మెంట్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. మన ఎకానమీ తప్పకుండా బాగుపడుతుంది. ఎన్ఆర్ఐలు మరింత డబ్బును ఇన్వెస్ట్ చేయాలి. వారికి ఇదే మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్‌‌లో పరిస్థితులను చక్కదిద్దడానికి అక్కడి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. ప్రభుత్వాలు కరోనాను కంట్రోల్‌‌ చేస్తూనే ఎకానమీని రక్షించాలి. మన దగ్గర చాలా మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి ఎకానమీ మరింత క్షీణించకపోవచ్చు. ప్యాకేజీల వల్ల ప్రజలకు, కంపెనీలకు, ఇండస్ట్రీలకు ఎంతో మేలు జరుగుతుంది. సంపద మరింత సమర్థంగా పంపిణీ కావాలి. రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇవ్వాలి. హెల్త్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను పెంచాలి. ఇన్వెస్ట్‌‌మెంట్లకు ఇండియాలో అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. వ్యవసాయం బాగుంది. సంపద పంపిణీ పెరుగుతోంది. అయితే కేంద్రం రాష్ట్రాలకు మరింత డబ్బు ఇవ్వాలి. – మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ, ఇండస్ట్రియలిస్టు

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి