
సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థుల లేఖ
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్ పరీక్షలో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్టు పెట్టాలని ప్రభుత్వానికి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్1 మెయిన్ఎగ్జామ్ లో ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్టుగా పెట్టి, మాతృభాష తెలుగును విస్మరించడం సరికాదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తెలుగు మీడియంలో చదివి గ్రూప్ 1 పరీక్ష రాయాలనుకునే వారిని కూడా పరిగణలోకి తీసుకొని, ఇంగ్లిష్తో పాటు తెలుగునూ చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
గ్రూప్ 1 ఉద్యోగులు వారి బాధ్యతలు నిర్వహించే క్రమంలో తెలుగు భాష పరిజ్ఞానం అవసరమని గుర్తుచేశారు. ఏపీతో పాటు అన్ని రాష్ర్టాలూ మాతృభాషను గ్రూప్1 పరీక్షలో క్వాలిఫైయింగ్ టెస్టుగా నిర్వహిస్తున్నాయని, ఎస్ఐ పరీక్షలోనూ తెలుగు పరీక్ష ఉంటుందని వివరించారు. కాబట్టి ప్రభుత్వం గ్రూప్1 పరీక్షలోనూ తెలుగును క్వాలిఫైయింగ్ టెస్టుగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.