అమెరికాలో తెలుగు టెకీ మృతి.. డెలివరీ తర్వాత భార్యకు చెప్పిన ఫ్రెండ్స్

అమెరికాలో తెలుగు టెకీ మృతి.. డెలివరీ తర్వాత భార్యకు చెప్పిన ఫ్రెండ్స్

గుండెపోటుతో చనిపోయిన ప్రశాంత్ రెడ్డి
కాన్పు అయ్యాకే భార్యకు చెప్పిన ఫ్రెండ్స్
మృతుడి సోదరుడికి వీసా ఇప్పించిన కేటీఆర్
డల్లాస్‌లో అంత్యక్రియలు పూర్తి

గజ్వేల్ రూరల్, వెలుగు: అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సిద్ధి పేట జిల్లా గజ్వేల్‌కు చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(36) బుధవారం (ఈ నెల19న) గుండె పోటుతో చనిపోయాడు. ప్రశాంత్ పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లోనే గుండె పోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేసిన ప్రశాంత్, ఆరేళ్లుగా అమెరికాలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితమే హైదరాబాద్‌కు చెందిన దివ్య అనే యువతితో వివాహం జరిగింది. వీరికి అదితి అనే మూడేళ్ళ పాప ఉంది. అయితే ప్రశాంత్ రెడ్డి మృతి చెందిన సమయంలో అతని భార్య ప్రసవం కోసం హాస్పిటల్‌లో ఉంది. భర్త చనిపోయిన విషయాన్ని స్నేహితులు ఆమెకు చెప్పలేదు. 20న ఆమె ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది.ఆ తర్వాత భర్త మరణించిన విషయాన్ని ఆమెకు చెప్పారు. మూడు రోజులుగా మృతదేహాన్ని గజ్వేల్ తెచ్చేందుకు ప్రయత్నించినా, కుదరలేదు. దీంతో శనివారం డల్లాస్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞా‌పూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్. సి. రాజమౌళి కొడుకు సంతోష్.. తన స్నేహితుడు ప్రశాంత్ చనిపోయిన విషయం తెలుసుకుని, అతడి కుటుంబసభ్యులకు వీసా కోసం మంత్రి కేటీఆర్‌ను సాయం కోరారు. అమెరికా ఎంబసీ అధికారులతో మంత్రి మాట్లాడి మృతుడి సోదరుడు ప్రమోద్‌కు వీసా వచ్చేలా చూశారు. ప్రమోద్ అమెరికా వెళ్లి శనివారం ప్రశాంత్ అంత్యక్రియలు నిర్వహించాడు.

For More News..

వైరల్ వీడియో: బాహుబలి మార్ఫ్ వీడియోలో ట్రంప్ ఫ్యామిలీ

‘వెలుగు’ ఎఫెక్ట్: దారికొచ్చిన మంత్రులు