12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

బషీర్​బాగ్, వెలుగు : వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వారికి ప్రతి ఏడాది తెలుగు యూనివర్సిటీ పురస్కారాల పేరుతో సత్కరిస్తుందని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు తెలిపారు. 2021 ఏడాదిగానూ తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఘనంగా జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన ఎస్వీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్​లర్ కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ.. బోధన, పరిశోధనలతో పాటు సంగీత, సాహిత్య, నృత్య, శిల్ప, నాటక రంగాల్లోని నిష్ణాతులైన వారిని గుర్తించి వారికి పురస్కారాలను అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రార్ భట్టు రమేశ్ స్వాగతోపన్యాసం చేశారు. 

తంజావూరుకు చెందిన ఎస్. కుమార్ ప్రదర్శించిన మేలట్టూరు భాగవత కళ ఆకట్టుకుంది. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన 12 మందికి ప్రతిభా పురస్కారం, నగదు అందించి శాలువాతో సత్కరించారు. పురస్కారం అందుకున్న వారిలో గింజల నరసింహారెడ్డి(కవిత్వం), తేరాల సత్యనారాయణ శర్మ( పరిశోధన) బి. నరహరి(చిత్ర లేఖనం), ఈమని శివనాగిరెడ్డి( శిల్పం), ఎస్. కుమార్(నృత్యం), పి. పూర్ణచందర్( సంగీతం), జి. వల్లీశ్వర్( పత్రికా రంగం), దెంచనాల శ్రీనివాస్ 

(నాటక రంగం), వెడ్మ శంకర్(జానపద కళా రంగం), ముదిగొండ అమరనాథ శర్మ(అవధానం), కొండపల్లి నిహారిణి( ఉత్తమ రచయిత్రి), జి. అమృతలత (నవలా కథా విభాగం) ఉన్నారు.  విస్తరణ సేవా విభాగం ఇన్ చార్జి రింగు రామ్మూర్తి కార్యక్రమానికి కో ఆర్డినేటర్​గా వ్యవహరించారు.