పోలీస్ అవుదామనుకున్నాడు.. హీరో అయ్యాడు శరత్ బాబు సినీ ప్రస్తానం.. వ్యక్తిగత జీవితం

పోలీస్ అవుదామనుకున్నాడు.. హీరో అయ్యాడు శరత్ బాబు సినీ ప్రస్తానం.. వ్యక్తిగత జీవితం

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. శరత్ బాబు మృతిపట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు శరత్ బాబు. ఆయన పూర్తి పేరు సత్యంబాబు దీక్షితులు. శరత్ బాబు తండ్రికి హోటల్ బిజినెస్ ఉండేది. తనలాగే కొడుకు కూడా బిజినెస్  చేసుకుంటాడని శరత్ బాబు తండ్రి భావించారు.

 కానీ చిన్నపటి నుండి శరత్ బాబుకు పోలీస్ అవ్వాలనే ఆశ బలంగా ఉండేది. దాని కోసం చాలా కష్టపడ్డాడు. అయితే తన ఫ్రెండ్స్ మాత్రం నువ్వు హీరోలా ఉన్నావ్ సినిమాలలో ట్రై చెయ్ అనేవారు. ఆ మాటలను శరత్ బాబు సీరియస్ గా తీసుకోలేదు. కానీ శరత్ బాబు వాల్ల  అమ్మ కూడా అదే మాట అందంతో ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి పెరిగింది. దాంతో  సినిమాలలో ట్రై చెయడానికి  మద్రాసులో అడుగుపెట్టాడు శరత్ బాబు. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే.. రామవిజేత అనే సంస్థ తమ నిర్మించబోయే కొత్త సినిమా కోసం నటీనటులు కావాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అలా ఆ సినిమాలో హీరోగా మొదటి అవకాశం దక్కించుకున్నాడు శరత్ బాబు. ఆ సినిమానే రామరాజ్యం. అందులో శరత్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుసగా బంగారు మనిషి, అమెరికా అమ్మాయి, దొరలు-దొంగలు వంటి హిట్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. అలా మొదలైన శరత్ బాబు సినీ ప్రస్తానం..  తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో కలిపి  220కి పైగా సినిమాలు చేసే వరకు సాగింది. 
 

నటుడిగా ఆయనను అనేక పురస్కారాలు కూడా వరించాయి.  1981లో వచ్చిన సీతాకోక చిలుక, 1988 వచ్చిన ఓ భార్య కథ, 1989లో వచ్చిన నీరాజనం సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇక సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆయనకు టాలీవుడ్ లేడి కమెడియన్ రామాప్రభతో పరిచయం ఏర్పడింది. ఆపరిచయం కాస్త ఇష్టంగా మారడంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని  వ్యక్తిగత కారణాల వల్ల 1988లో ఈ జంట విడిపోయింది. ఆతరువాత స్నేహ నంబియార్ ను పెల్లుచేసుకున్న శరత్ బాబు 2011లో ఆమెతో కూడా విడాకులు తీసుకున్నాడు. 

ఆతరువాత ఒంటరిగానే ఉన్న ఆయన.. సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. తెలుగులో ఆయన చివరగా కనిపించిన చిత్రం వకీల్ సాబ్.  నెల రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ బాబును.. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్‌ కు తరలించారు. దాదాపు నెలరోజులుగా ఐసియూలోనే చికిత్స పొందుతున్న శరత్ బాబు మే 22 సోమవారం మధ్యాహ్నం చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. తన నటనతో కోట్ల మందికి వినోదాన్ని  పంచిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.