బిగ్‌బాస్ రివ్యూ : కడుపు నిండాలంటే ఆటలు ఆడక తప్పదు

బిగ్‌బాస్ రివ్యూ : కడుపు నిండాలంటే ఆటలు ఆడక తప్పదు

నామినేషన్ ప్రక్రియలో భాగంగా మేమంత, మేమింత అని వాదులాడుకున్న కంటెస్టెంట్లు.. కెప్టెన్సీ టాస్క్ విషయం వచ్చేసరికి చప్పబడ్డారు, చతికిలపడ్డారు. గేమ్‌ని సీరియస్‌గా తీసుకోకుండా ఎవరి తీరులో వాళ్లు ఉన్నారు. దాంతో బిగ్‌బాస్‌కి కోపమొచ్చింది. ఆటా లేదు గీటా లేదు అవతలికి పొమ్మన్నాడు. ఆసక్తి లేకపోతే గెటవుట్ అంటూ గేటు కూడా తెరిచాడు. ఊహించని ఈ షాక్‌కి హడలిపోయిన హౌస్‌మేట్స్ ఆ తర్వాత ఏం చేశారు? బిగ్‌బాస్ కోపాన్ని చల్లార్చగలిగారా లేదా?

మొట్టికాయలు మింగుడు పడలా!

ఆట మధ్యలో ఆపేసేసరికి అందరూ హడలిపోయారు. టాస్క్ ఆడనివ్వమంటూ అందరూ బిగ్‌బాస్‌ని తెగ బతిమాలడం మొదలుపెట్టారు. కానీ బిగ్‌బాస్‌ పట్టు బిగించాడు. అస్సలు కరగనన్నాడు. అయినా వదలకుండా అందరూ కెమెరాల దగ్గరకు పోయి అడుగుతూనే ఉన్నారు. బాలాదిత్య చాలాసేపు బిగ్‌బాస్‌ని రిక్వెస్ట్ చేశాడు. ఆయనేమైనా కన్విన్స్ అవుతాడేమోనని ఆశపడ్డాడు. కానీ నో రెస్పాన్స్. అన్నిటికీ రాగం అందుకునే సూర్య ఈ వంకన మరోసారి కన్నీళ్లు కుమ్మరించాడు. నేను కెప్టెన్‌గా ఫెయిలయ్యాను బిగ్‌బాస్ అంటూ కెమెరా ముందు కాసేపు మొత్తుకున్నాడు. ఆ తర్వాత ముడుచుకుని మూలన కూర్చున్నాడు. ఎందుకేడుస్తున్నావ్ అని గీతూ వచ్చి అడిగేసరికి బాగా ఆడినప్పుడు ఆట పోతే పెయిన్ ఉంటుందక్కా అంటూ ఫిలాసఫీ చెప్పాడు. అతని ఎమోషన్స్ కరెక్టే కావచ్చు కానీ ప్రతిదానికీ ఏడుస్తుంటే చూడటానికి మాత్రం చిరాకేస్తోంది. ఇక మిగతావాళ్లంతా ఎవరికి నచ్చినట్టు వాళ్లు తమ ఆటను అనలైజ్ చేసుకుంటున్నారు. బాగానే చేస్తున్నాం కదా అని కవరింగ్ ఇస్తోంది ఇనయా. పైగా వాళ్లందరూ మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అంటూ బిగ్‌బాస్ మెచ్చుకున్నవాళ్లని తప్పుబడుతోంది. ఆ క్యారెక్టర్స్లో ఉండి ఏం ఎంటర్‌‌టైన్ చేస్తాం అంటోంది శ్రీసత్య. ఓపక్క తను ఫెయిలైనా.. రేవంత్ పర్‌‌ఫార్మ్ చేయడం నేను చూడలేదంటూ స్టేట్‌మెంట్ ఇస్తున్నాడు బాలాదిత్య. మొత్తానికి ఎవరికి వాళ్లు తాము బాగా ఆడినట్లు, బిగ్‌బాస్‌కే సరిగ్గా అర్థం కానట్టు బిల్డప్ ఇస్తున్నారు. 

తప్పులు చేసినా గొప్పలే!

ఆదిరెడ్డి కాన్ఫిడెన్స్ కోటలు దాటుతోందీ మధ్య. ప్రతి ఒక్కరి ఆట తీరునీ, మాట తీరునీ రివ్యూ చేస్తూ ఉండటమే కాక.. నామినేషన్ టైమ్‌లో నోరు పారేసుకుంటున్నాడు. నువ్వు నాకంటే బాగా ఆడట్లేదు అంటూ అందర్నీ ఎత్తి చూపిస్తాడు. నువ్వు నా అంత డిజర్వ్ కాదు అని స్టేట్‌మెంట్లు పాస్ చేస్తాడు. కానీ ఏదైనా పర్‌‌ఫార్మ్ చేయమనేసరికి గమ్మున కూచుంటాడు. నిన్న ఆటలో కూడా అతను ఏమాత్రం ఎంటర్‌‌టైన్ చేయలేదు. కూలీ నంబర్‌‌ 1లో వెంకటేష్ పాత్ర ఇస్తే కనీసం ఆయన బాడీ లాంగ్వేజ్‌ని కానీ, వాయిస్‌ని కానీ ఇమిటేట్ చేయడానికి ట్రై చేయకపోగా.. తనకి సంబంధం లేని పుష్పలో కేశవ పాత్రలాగా యాక్ట్ చేసి ఇరిటేట్ చేశాడు. ఇలాంటివన్నీ చేయబట్టే నిన్న అందరికీ అక్షింతలు వేశాడు బిగ్‌బాస్. అయినా కూడా మనోడికి విషయం బుర్రకి ఎక్కట్లా. తాను ఆడకపోగా ఈ సీజన్‌కి వచ్చినవాళ్లలో ఎక్కువమంది వేస్ట్ క్యాండిడేట్లు అంటూ మిగతావారి గురించి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. దాంతో గీతూ గట్టిగానే వేసుకుంది. నువ్వు మాత్రం ఆడావ్, అస్సలు ఏమీ చేయలేదు, చాలా డిజప్పాయింట్ చేశావ్ అంటూ గాలి తీసేసింది. అయినా కూడా నేను సూపరే అన్నట్టు మాట్లాడుతుంటే ఏమనాలి? పడిపోయి పనుండి వంగున్నానని చెప్పినట్టుంది మనోడి వ్యవహారం.  

ఇనయా ఈత.. సూర్య మోత

తాను బాగా ఆడలేనందుకు ఫీలవడం మానేసి, బాగా ఆడినవాళ్ల లిస్టులో సూర్య ఉన్నందుకు ఫీలవుతోంది ఇనయా. కష్టపడి ఆడిన రేవంత్, సూర్య, శ్రీహాన్, గీతూ లాంటి వారంతా టాస్క్ పోయినందుకు బాగా ఫీలవుతున్నారు. దానికి ఇనయా వేరే అర్థం తీసింది. వాళ్లందరూ మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, ముఖం తిప్పేసుకుంటున్నారు, పైగా చాన్స్ ఇస్తే వాళ్లతో కూడా బాగా ఆడిస్తాం అని బిగ్‌బాస్‌కి చెప్తున్నారు, ఏంటి వీళ్ల ఉద్దేశం అంటూ అందరి దగ్గరా ఆవేశంగా డైలాగులు కొట్టింది. కాస్త కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అదంతా సూర్య మీద ఉక్రోషమే అని క్లియర్‌‌గా అర్థమైపోయింది. పైగా అందరితో మాట్లాడేసి వెళ్లి ఓ మూలన కూర్చుంది. అక్కడికి సూర్య వచ్చి ఏదో చెప్పబోతే నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అనడంతో అతను లేచి వెళ్లిపోయాడు. తర్వాత ఆమె స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకి ఈత కొట్టడం మొదలెట్టింది. అంతే.. ఇక ఒంటరిగా పడుకుని కెమెరా ముందు పర్‌‌ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు సూర్య. ఇనయా అంటే తనకి చాలా ఇష్టమని, కానీ తను అవకాశమున్నా ఆడకపోవడం బాధ కలిగించిందని తెగ డ్రామా చేశాడు. అతని మాటల మోతని భరించడం రానురాను కష్టంగా మారుతోంది. సందు దొరికితే చాలు ఏకపాత్రాభినయం మొదలుపెట్టి ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నాడు. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆకలి కేకలు

అందరూ బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారు. కెప్టెన్ అయ్యుండి కూడా సరైన అరేంజ్‌మెంట్స్ చేయకుండా ఒక్కసారి స్టోర్‌‌ రూమ్ డోర్ తీస్తే ఫ్రూట్స్ తెచ్చుకుంటానంటూ బిగ్‌బాస్‌ని బతిమాలుతున్నాడు సూర్య. అంతలో బిగ్‌బాస్ నుంచి ఓ లేఖ వచ్చింది. అందరూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ మూసేయండి అని చెప్పాడు. వాళ్లు అలా లోపలికి వెళ్లారో లేదో ఇలా దొంగలు ఎంటరయ్యారు. ఇంట్లో ఉన్న ఫుడ్డు మొత్తం దోచుకుపోయారు. ఆ తర్వాత మరో పోస్ట్ వచ్చింది. ఇంట్లో దాచుకున్న ప్రతి ఆహార పదార్థాన్నీ స్టోర్‌‌ రూమ్‌లో పెట్టమని ఆ లెటర్‌‌లో రాసి ఉంది. దాంతో రేవంత్‌ తన దగ్గరున్నదాన్ని గబగబా తినేశాడు. సగం ఆమ్లెట్ వేసుకున్న ఇనయా సూర్య సలహాతో మైక్రో అవన్‌లో దాచేసింది. అయితే అది అప్పటికే ఆఫ్ అయిపోవడంతో హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్నే లాగించేసింది. ఆదిరెడ్డి ఏమీ పట్టనట్టే యాపిల్ తింటూ కూల్‌గా కూర్చున్నాడు. ఇక నుంచి ఇంట్లో ఏది కావాలన్నా పోరాడి, కష్టపడి సంపాదించుకోవాలని బిగ్‌బాస్ శాసించాడు. తమ తప్పుకు అతను కావాలనే ఈ శిక్ష వేశాడు కాబట్టి యాక్సెప్ట్ చేయాలని అందరూ అనుకున్నారు. అయితే కాసేపటికి ఆకలి మొదలవ్వడంతో ఫుడ్ దొరకాలంటే ఏం చేయాలో చెప్పమని బిగ్‌బాస్‌ని బతిమాలడం స్టార్ట్ చేశారు. సూర్య మాత్రం మరీ కక్కుర్తిగా అక్కడక్కడ పడిన పప్పులు కూడా ఏరుకుని తిన్నాడు. దాన్ని గీతూ షేర్ చేసుకుని తినడం మరీ విచిత్రం. 

ఫుడ్డు లేదు.. ఆడక తప్పలేదు

తినడానికి ఫుడ్డు లేదు. కడుపు నిండాలంటే ఆటలు ఆడక తప్పదు. బిగ్‌బాస్ భలే ఇరికించాడు మొత్తానికి. ఒకదాని తర్వాత ఒకటిగా కొన్ని పోటీలు పెట్టాడు. ముందుగా కబడ్డీ ఆడమన్నాడు. ఇందులో మూడు రౌండ్స్ ఉంటాయని, కనీసం రెండు రౌండ్స్ గెలిచిన టీమ్‌కి ఫుడ్ లభిస్తుందని, ఓడిపోయినవారికి ఏమీ ఉండదని చెప్పాడు. ముందు రోజు విభజించిన టీమ్స్లానే కంటిన్యూ అవమనడంతో అందరూ పోటీకి రెడీ అయ్యారు. గీతూ సంచాలకురాలు. ఆమె ఆట విషయంలో కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యింది కానీ పోటీ బాగానే నడిచింది. చివరికి టాలీవుడ్ డైనమైట్స్ టీమ్ గెలిచింది. ఆ తర్వాత మరొక పోటీ పెట్టాడు. ఒక్కో టీమ్‌ నుంచి ముగ్గురు సభ్యుల్నిఎంచుకోవాలి. వాళ్లు గార్డెన్ ఏరియాలో ఉన్న బాల్స్ని తమ తమ బాస్కెట్స్లో వేయాలి. ఎక్కువ బాల్స్ వేసిన టీమ్‌కి ఫుడ్ వస్తుంది. ఫైమా సంచాలకురాలు. బయట పడిపోయిన బాల్స్ని లోపలికి విసిరినప్పుడు ఆమె మధ్యలో వేయకుండా అవతలి టీమ్‌కి అందేలా వేయడంతో అది తప్పు అంటూ శ్రీసత్య, వాసంతి క్వశ్చన్ చేశారు. దానికి ఫైమా ఎప్పట్లాగే ఆవేశంగా తన వివరణ ఇచ్చింది. కానీ వాళ్లు శాటిస్‌ఫై అవ్వలేదు. చివరికి టాలీవుడ్ ఫ్యాంటసీస్‌ టీమ్ గెలవడంతో వాళ్ల కడుపులు కూడా నిండాయి. ఒక టీమ్‌లో ఉండి వేరే టీమ్‌కి వచ్చిన ఫుడ్‌ని సీక్రెట్‌గా తినడంతో గీతూకి, ఆమెకి ఫుడ్ పంచిన ఆదిరెడ్డికి శిక్ష వేశాడు బిగ్‌బాస్. పెద్ద పెద్ద గిన్నెలు పంపించి వాటిని శుభ్రంగా కడగమన్నాడు. కెప్టెన్ గిన్నెలు కడగమంటే నో అనే గీతూ ఇప్పుడు చచ్చినట్టు ఆ పాత్రలు కడిగింది. అయినా పెద్ద ఫీలవ్వకుండా లైట్ తీసుకుంది.  

శ్రీహాన్ నువ్వు సూపరబ్బా!

అవసరం లేకపోతే మాట్లాడడు. ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా తడబడడు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. డీసెంట్‌గా ఉంటాడు. అంతే డీసెంట్‌గా ప్రవర్తిస్తాడు. ఒక పాయింట్ చెప్పాడంటే ఎవరు ఏమన్నా దానిమీదే నిలబడతాడు. ఇవన్నీ శ్రీహాన్‌కి ప్లస్ పాయింట్స్. అతనికున్న మరో ప్లస్ పాయింట్.. ఆటమీద ఫుల్‌ క్లారిటీతో ఉండటం. బహుశా ఈ సీజన్‌లో గేమ్ గురించి అతనికి ఉన్న క్లారిటీ మరెవరికీ లేదేమో. కూల్‌గా ఉంటూనే అందరికీ గట్టి పోటీనిస్తుంటాడు. పైగా మంచి పర్‌‌ఫార్మర్. నిన్న బాలయ్య పాత్రలో అదరగొట్టాడు. ఇవాళ వినోదం పాళ్లు మరింత పెంచాడు. దొంగలు ఫుడ్ ఎత్తుకుపోయాక రేవంత్ పాటలు పాడుతుంటే అతనితో శ్రుతి కలిపాడు. తర్వాత రేవంత్‌నే డామినేట్ చేశాడు. కబడ్డీ ఆటలో కూడా చక్కగా ఆడాడు. ఆ తర్వాత గీతూకి, ఆదిరెడ్డికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కూడా పక్కనే కూర్చుని పాటలు అల్లి పాడాడు. ఆశువుగా అతను పాడిన విధానం నిజంగా సూపర్. మొత్తంగా అతను కంప్లీట్ పర్‌‌ఫార్మర్ అనిపిస్తోంది. అందుకేనేమో.. ఓట్లు కూడా అతనికే ఎక్కువ పడుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. ఇదే విధంగా ముందుకెళ్తే విన్నర్ అయ్యే చాన్సులు ఫుల్లుగా ఉన్నాయతనికి. అయితే అలాంటి శ్రీహాన్‌ని కూడా ఇవాళ ఇనయా కన్‌ఫ్యూజ్ చేయడం విశేషం. ఆమె శ్రీహాన్ దగ్గరకు వెళ్లి.. ఏ తప్పూ లేకపోయినా కావాలనే నిన్ను నామినేట్ చేశాను, ఈ హౌస్‌లో ఉన్నవాళ్లందరి కంటే నువ్వు బెస్ట్ అంటూ సారీ చెప్పింది. దాంతో షాకైపోయాడు. ఆ విషయం అందరితో చెప్పాడు. అయితే వాసంతికి చెప్పినప్పుడు మాత్రం ‘సూర్య వెనకాల ఉన్నాడా’ అని అడిగిందామె. ఉన్నాడు అనడంతో ‘అదీ సంగతి.. నువ్విక మర్చిపో’ అంది. దాంతో సూర్యని ఉడికించడానికే ఆమె అలా చేసిందని అర్థమై నవ్వేశాడు శ్రీహాన్. 

మొత్తానికి ఏమాత్రం పస లేని హౌస్‌మేట్స్ ఆటతీరు చూసి బిగ్‌బాస్‌కి అరికాలి మంట నెత్తికెక్కింది. అందుకే ఫుడ్డు లేకుండా చేసేశాడు. పోటీల మీద పోటీలు పెట్టి బద్దకం వదిలిస్తున్నాడు. తేడా వస్తే శిక్షలు వేసి తాట తీస్తున్నాడు. మరి ఇప్పటికైనా ప్లేయర్స్ అంతా గాడిలో పడతారో లేదో. నెక్స్ట్ టాస్కుల్లో అయినా బెస్ట్ ఇస్తారో లేదో.