Temba Bavuma: సౌతాఫ్రికాకు గోల్డెన్ లెగ్‌గా బవుమా.. 11 టెస్టుల్లో ఓటమి లేకుండా జైత్రయాత్ర

Temba Bavuma: సౌతాఫ్రికాకు గోల్డెన్ లెగ్‌గా బవుమా.. 11 టెస్టుల్లో ఓటమి లేకుండా జైత్రయాత్ర

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అతను ఆటకు పనికిరాడని.. కెప్టెన్సీ అనవసరంగా ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అతను ఆడకపోతే ట్రోల్స్, మీమ్స్ చేయడానికి రెడీగా ఉంటారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో బవుమా చెత్త బ్యాటింగ్ తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నిటికీ బవుమా చెక్ పెట్టి  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను సౌతాఫ్రికాకు అందించాడు. 27 ఏళ్ళసఫారీ జట్టు ఐసీసీ టైటిల్ కరువు తీర్చిన బావుమా.. ఇండియాలో 15 ఏళ్ళ సౌతాఫ్రికాపై టెస్ట్ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో బవుమా టెస్టుల్లో తన విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు.   

కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియాపై విజయంతో టెస్టుల్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమి లేని కెప్టెన్ గా తన రికార్డ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు ఓవరాల్ గా 11 టెస్టుల్లో కెప్టెన్సీ చేసిన ఈ సఫారీ కెప్టెన్ 10 విజయాలు.. ఒక డ్రా తో 90 శాతం పైగా విజయాలను సాధించాడు. క్రికెట్‌లో ఓటమి లేకుండా కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన అరుదైన రికార్డు బవుమా ఖాతాలోనే ఉంది. బవుమా తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ రెండో స్థానంలో ఉన్నాడు.

1902-1921 మధ్య కాలంలో ఆర్మ్‌స్ట్రాంగ్ 10 టెస్ట్ మ్యాచ్ ల్లో కెప్టెన్ గా చేసి  8 విజయాలు, 2 డ్రాలతో బవుమా తర్వాత స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడంతో వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ రికార్డును బవుమా బ్రేక్ చేసి అగ్ర స్థానంలోకి దూసుకెళ్ళగా.. టీమిండియాపై విజయంపై తన రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో తన కెప్టెన్సీతో పాటు బవుమా బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో 55 పరుగులు చేసి సౌతాఫ్రికాకు విలువైన పరుగులను అందించాడు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తన దుర్బేధ్యమైన డిఫెన్స్ తో ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో బవుమాదే ఏకైక హాఫ్ సెంచరీ కావడం విశేషం. 

కోల్‎కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. సఫారీ బౌలర్ల ధాటికి 124 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. వాషింగ్ టన్ సుందర్ (31), అక్షర్ పటేల్ (26) పోరాటం జట్టు విజయానికి సరిపోలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. జాన్సెన్, మహరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  హార్మర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.