స్టూడెంట్ల చదువులపై ఎండల ఎఫెక్ట్..స్కూళ్లకు పంపేందుకు జంకుతున్న పేరెంట్స్

స్టూడెంట్ల చదువులపై ఎండల ఎఫెక్ట్..స్కూళ్లకు పంపేందుకు జంకుతున్న పేరెంట్స్
  • రాష్ట్రంలో 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు
  • అటెండెన్స్ 20-30 శాతం మాత్రమే 
  • పలు విద్యాసంస్థల్లో ఆన్​లైన్ క్లాసులు
  • ఎండలు తగ్గే వరకు సెలవులు ఇవ్వాలంటున్న పేరెంట్స్

హైదరాబాద్/ఖమ్మం, వెలుగు: రుతుపవనాలు రావడం ఆలస్యం కావడంతో జూన్​నెల ముగుస్తున్నప్పటికీ ఎండలు మండిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ ఎఫెక్ట్​స్టూడెంట్లపైనా పడింది. ఈ నెల 12వ తేదీ నుంచే స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ తమ పిల్లలను పంపేందుకు పేరెంట్స్​జంకుతున్నారు. దీంతో స్కూళ్లకు వచ్చే స్టూడెంట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. సర్కార్ స్కూళ్లకు హాజరు సాధారణంగానే ఉన్నప్పటికీ.. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లకు పెద్దగా రావడంలేదు. దీంతో చాలా స్కూళ్లలో అటెండెన్స్ 20 నుంచి 30 శాతం మాత్రమే నమోదవుతోంది.

ఐదో తరగతి వరకు పంపడంలేదు

నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాస్ రూమ్ లు వెలవెలబోతున్నాయి. ఆయా స్కూళ్లను బట్టి ఒక్కో క్లాస్ లో 25 నుంచి 50 మంది వరకు స్టూడెంట్లు ఉండగా.. 20 శాతం లోపు మాత్రమే హాజరు నమోదువుతోంది. నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు తరగతి గదుల్లో నలుగురు, ఐదుగురు మాత్రమే కనిపిస్తున్నారు. వచ్చేవారికి పేరెంట్స్​ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పంపుతున్నారు. మొత్తానికి ఈసారి వర్షాకాలం ప్రారంభమైనా వానలు పడకపోవడం, ఎండలు దంచికొడుతుండటంతో ఎండల ప్రభావం తగ్గిన తర్వాతనే తమ పిల్లలను స్కూళ్లకు పంపాలని పేరెంట్స్​భావిస్తున్నారు. 

స్టూడెంట్లకు ఆన్ లైన్ క్లాసులు

స్కూల్ యాజమాన్యాలు సైతం స్టూడెంట్ల హాజరుపై పేరెంట్స్​ను ఒత్తిడి చేయడంలేదు. స్కూళ్లకు పంపే విషయాన్ని వారికే వదిలేశారు. స్టూడెంట్లు మరికొన్ని రోజులు స్కూళ్లకు వచ్చే అవకాశం లేదని భావించిన కొన్ని విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాయి. కరోనా సమయంలో నిర్వహించిన విధంగా ఆన్ లైన్ లో క్లాసులు బోధిస్తున్నారు. స్టూడెంట్లకు కూడా​ఈ తరహా క్లాసులు అలవాటు ఉండటంతో ఇబ్బందిగా ఉండటంలేదు.  మరికొన్ని స్కూళ్ల యాజమాన్యాలు సైతం ఇందుకు ప్లాన్​చేస్తున్నాయి.

అందుకే సెలవులు పొడిగించలేదా?

రాష్ట్రమంతటా ఇంకా ఎండలు మండుతున్నా స్కూళ్లు ఓపెన్​చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న విద్యాదినోత్సవాన్ని నిర్వహిస్తుండటం వల్లనే సెలవులను పొడిగించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల స్టూడెంట్లు, బడిబాటలో పాల్గొన్న టీచర్లు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురై ఇబ్బంది పడుతున్నారు. ఈ సెలవులను పొడిగించి.. దసరా, సంక్రాంతి సెలవుల్లో అడ్జెస్ట్ చేయవచ్చని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వానికి చిన్నారుల ఆరోగ్యం, ప్రాణాల కంటే ఉత్సవాలు, సంబురాలే ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నాయి.

పిల్లల ఆరోగ్యం వైపే పేరెంట్స్​మొగ్గు

రానున్న మరికొన్ని రోజులపాటు ఎండలు కొనసాగనున్నాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఎండలకు తిప్పొద్దని డీ-హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అధిక ఎండల వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయని, ఒక్కో సందర్భంలో బ్రెయిన్ పై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు ఆయా ప్రభుత్వాలు వేసవి సెలవులను పెంచాయి. ఎండల  నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ సమ్మర్ హాలీడేస్ ని పెంచి ఉంటే బాగుండేదని పేరెంట్స్​ అభిప్రాయపడుతున్నారు. పిల్లల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత అని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎండలు తగ్గేంత వరకు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.

సెలవులు ఇవ్వాలె..

ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉంది. చిన్నారులు ఎండలో స్కూళ్లకి ఎలా వెళతారు? ఎండలు తగ్గేంత వరకు సమ్మర్ హాలీడేస్ ని పొడిగించాలె. లేకపోతే కరోనా సమయంలో నిర్వహించిన విధంగా కొన్నాళ్లపాటు ఆన్ లైన్ క్లాసులు చెప్పాలి.

- వెంకట్ సాయినాథ్, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ

పిల్లల ఆరోగ్యం కంటే ఉత్సవాలే ముఖ్యమా?

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సెలవులు పొడిగించాల్సింది. స్టూడెంట్ల ప్రాణాలను పణంగా పెడుతూ స్కూళ్లు, గురుకులాల్లో ఉత్సవాల కోసం ప్రభుత్వం ఇలా చేయడం దుర్మార్గం. కనీసం ఎండలు తగ్గేవరకు ఒంటి పూట బడులు పెట్టాలె. 

- ఆజాద్​, పీడీఎస్​యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

స్కూళ్లో ఉక్కపోత తట్టుకోలేకపోతున్నాం

ఎండలకు బడికి పోవాలంటేనే భయం వేస్తోంది. స్కూల్లో విపరీతమైన ఉక్కపోత. ఫ్యాన్ వేస్తే వేడి గాలి వస్తోంది. బాటిల్​లో కూల్ వాటర్ తెచ్చుకుంటే 11 గంటలకే వేడెక్కుతున్నాయి. ఎండలకు మధ్యాహ్నం భోజనం కూడా తినబుద్ది కావడం లేదు. ఈ ఎండలకు సగం మందికి పైగానే బడికి రావడం లేదు.

- తూమాటి నమిత ఆదిత్య, 9వ తరగతి, ఓ ప్రవేట్ స్కూల్, ఖమ్మం