హైదరాబాద్: తెలంగాణ శోకసంద్రంలో మునిగిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర కంకర టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో 19 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో మరో పెను విషాదం ఏంటంటే.. మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ముగ్గురిని నందిని, సాయి ప్రియ, తనుషాగా పోలీసులు గుర్తించారు.
ఈ అమ్మాయిల సొంతూరు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామం. ఈ అమ్మాయిల తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నాడు. చనిపోయిన ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. పెద్దమ్మాయి ఎంబీఏ చదువుతోంది.
ఈ ముగ్గురు అమ్మాయిలకు మరో అక్క ఉంది. ఆమెకు ఇటీవలే పెళ్లైంది. ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్లోనే ఉంటోంది. సొంతూరికి ఒక పెళ్లికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళుతుండగా ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఇలా మృత్యువు టిప్పర్ లారీ రూపంలో కబళించింది.
ముగ్గురు కూతుర్లను కోల్పోయిన కన్న తల్లిదండ్రులు బాధ మాటల్లో చెప్పలేనిది. ఇలా.. ఈ ప్రమాదంలో ఎవరిని కదిలించినా ఇలాంటి విషాదాలే వెలుగుచూస్తున్నాయి. ఈ బస్సు ప్రమాద దుర్ఘటనలో మొత్తం 19 మంది చనిపోయారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు.
వీకెండ్ సొంతూళ్లకు వెళ్లిన వాళ్లంతా తిరిగి హైదరాబాద్కు వస్తుండగా టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీ కొట్టి.. బస్సు పైనే బోల్తా పడింది. దీంతో.. టిప్పర్లోని కంకర.. బస్సులోని ప్రయాణికులపై పడింది. కంకర కప్పేయడంతో ఊపిరాడక 17 మంది చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
