జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న టెంపరేచర్లు

జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న టెంపరేచర్లు

 

  • జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న టెంపరేచర్లు
  • ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో 50 డిగ్రీల వరకు నమోదు 
  • వేడి తట్టుకోలేక డ్యూటీలకు రాని 40 శాతం మంది కార్మికులు  
  • డ్యూటీ టైమింగ్స్ మార్చాలని డిమాండ్ 
  • మరో నాలుగు రోజులు ఎండల తీవ్రత ఉంటుందన్న వాతావరణ శాఖ

హైదరాబాద్/కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మరింత ఎక్కువయ్యాయి. జిల్లాల్లో టెంపరేచర్లు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం ఐదు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా నమోదు కాగా, 10 జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్​లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, ​ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు కాగా.. నిర్మల్, పెద్దపల్లి, ​భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ​జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యాయి.

హైదరాబాద్​లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఇక్కడ రాత్రిపూట టెంపరేచర్లు 28 నుంచి 30 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా’ తుఫాన్ ప్రభావం​ రాష్ట్రంపై ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అది బలహీనపడినప్పటికీ, వేడి గాలులు రాష్ట్రం వైపు వీస్తున్నాయని అంటున్నారు. అందుకే ఎండలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మోచా తుఫాన్ ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్​ తీరాల మధ్య తీరం దాటిందని చెప్పారు. అది సోమవారానికి బలహీనపడుతుందని పేర్కొన్నారు. 

గనుల్లో 5 డిగ్రీలు ఎక్కువే..

బొగ్గు గనుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఓపెన్​కాస్ట్ గనుల్లో 50 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో సింగరేణి కార్మికులు అల్లాడిపోతున్నారు. డ్యూటీలు చేసేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం గనుల్లో పని చేస్తున్న వాళ్లలో ఎక్కువ మంది 50 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు వాళ్లే కావడంతో ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. దీంతో మధ్యాహ్నం టైమ్​లో 40 శాతం మంది కార్మికులు డ్యూటీలకు రావడం లేదు. ముఖ్యంగా ఓపెన్​కాస్ట్ ​గనుల్లో కార్మికుల హాజరు శాతం తగ్గిపోతున్నది. మామూలు ప్రదేశాలతో పోలిస్తే ఓపెన్​కాస్ట్​గనుల్లో ఎండ నాలుగైదు డిగ్రీలు ఎక్కువే ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఓపెన్​ కాస్ట్​గనుల్లో 50 నుంచి 51 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ వేడిలో పని చేయలేక టైమింగ్స్​మార్చాలని కార్మికులు కోరుతున్నారు. సింగరేణిలో 19 ఓపెన్​ కాస్ట్​ గనుల్లో దాదాపు 40 వేల మంది పని చేస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో ఐదు ఓపెన్​ కాస్ట్​ గనులు ఉన్నాయి. ఆ పరిధిలోనే 23 వేల మంది కార్మికులు ఉన్నారు. అందులో 40 శాతం మంది పగటిపూట డ్యూటీలకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. టైమింగ్స్​మార్చే విషయంపై మాత్రం స్పందించడం లేదు. 

కనీస సౌలతులు కరువు... 

భారీ వెహికల్స్, డోజర్లు, డంపర్లతో పాటు షావల్​మెషిన్లలో పని చేసే ఆపరేటర్లు, సూపర్​వైజర్లు, జనరల్​మజ్దూర్లు, కేబుల్​బాయ్స్ ఎండ తీవ్రతకు బాగా అలసిపోతున్నారు. డంపర్లు, షావల్​మెషిన్ల క్యాబిన్లలో ఏసీలు పని చేయడం లేదు. దీంతో 4 గంటలకోసారి ఉద్యోగులను మారుస్తూ యాజమాన్యం పనులు చేయిస్తున్నది. కేబుల్​బాయ్స్, ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి సౌకర్యం కూడా లేదు. ఎలక్ట్రీషియన్లు, సర్వే స్టాఫ్​, సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఓపెన్ కాస్ట్ క్వారీల్లో చలువ పందిళ్ల పేరుతో ఇనుప రేకులతో షెడ్లు వేశారు. అందులోకి వెళ్తే ఉక్కపోతతో చెమటలు కక్కుతున్నామని కార్మికులు వాపోతున్నారు. 

వెదురు తడకలు, గడ్డితో చలువ పందిళ్లను ఏర్పాటు చేయడంపై కొన్ని చోట్ల ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. చల్లని తాగునీటిని సైతం అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా ఏప్రిల్, మేలో ఓపెన్​కాస్ట్​ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తుంటారు. అయితే అవి కూడా చల్లగా ఉండడం లేదు. దీంతో డ్యూటీ టైమింగ్స్ ​మార్చాలని కార్మికులు కోరుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల పాటు రెస్ట్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం  ఒంటిగంట వరకు ఉండాలని, రెండో షిప్టు సాయంత్రం 4 గంటల తర్వాత ప్రారంభించాలని కోరుతున్నారు.

మధ్యాహ్నం 12 తర్వాత క్వారీల్లోకి పంపొద్దు.. 

ఎండలు పెరిగినందున ఓసీపీల్లో డ్యూటీ టైమింగ్స్ మార్చాలి. మధ్నాహ్నం 12 గంటల తర్వాత క్వారీల్లోకి కార్మికులను పంపించొద్దు. ఈ మేరకు మైన్స్​సేఫ్టీ డైరెక్టర్​జనరల్​ ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్ట్​ కార్మికులకు కూడా మజ్జిగ, ఓఆర్ఎస్​ ప్యాకెట్లు ఇవ్వాలి. చలువ పందిళ్లు వేయాలి. క్వారీ రోడ్లపై వాటర్​ స్ప్రే చేయాలి. 
- ఎండీ అక్బర్​ అలీ, ఏఐటీయూసీ నేత