దమ్ముంటే సన్న బియ్యం స్కీమ్ ఆపు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్

దమ్ముంటే సన్న బియ్యం స్కీమ్ ఆపు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్
  • సన్న బియ్యం కాంగ్రెస్ పూర్తి స్థాయి పథకం కాదు
  • ప్రతి కేజీకి కేంద్రమే రూ. 42 ఇస్తోంది 
  • ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమలవుతున్న సన్న బియ్యం పథకం కాంగ్రెస్ పూర్తిస్థాయి స్కీం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి కేజీకి రూ.42 చొప్పున కేంద్రమే ఇస్తోందని తెలిపారు. ధైర్యం ఉంటే ఈ స్కీంను ఆపి చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఇది దేశమంతా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకమని, కాంగ్రెస్ పార్టీ నిధులతో ఏమైనా బియ్యం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి.. బియ్యం స్కీం రద్దు చేస్తామని ఓటర్లను బెదిరిస్తున్నారిన ఆయన మండిపడ్డారు. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం ఏమీ కూలిపోదని.. కాంగ్రెస్ అమలు చేస్తున్నది కేవలం ఫ్రీ బస్సు పథకం మాత్రమేనని చెప్పారు. ‘‘బియ్యం పథకం రద్దు చేస్తామని చెప్పడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. ఈ అంశంపై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశాం” అని తెలిపారు. 
 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం నుంచి అభ్యర్థిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అన్ని హద్దులు దాటి వ్యవహరిస్తోందన్నారు. కిషన్ రెడ్డి మెట్రోను అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఒక వర్గానికి తాయిలాలు ఇస్తున్నారని ఆరోపించారు.

‘‘బంజారాహిల్స్​లో గుడి కూలగొట్టి విగ్రహం మాయం చేశారు. గుడికి స్థలం ఇవ్వడం చేతకాని కాంగ్రెస్​కు ఖబ్రస్థాన్​కు ఇచ్చేందుకు మాత్రం భూములు ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు. మజ్లిస్ అభ్యర్థిని అద్దెకు తెచ్చుకుని నిలబెట్టినా, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినా.. గెలుస్తామో లేదోనన్న అనుమానం, భయంతోనే కాంగ్రెస్ బెదిరింపులకు దిగుతోందని ఆయన ఆరోపించారు.

రేవంత్ రెడ్డి దేశ జవాన్లను అవహేళన చేసి మాట్లాడుతున్నారని, ఢిల్లీలో బడే మియా రాహుల్ గాంధీ, తెలంగాణలో ఛోటే మియా రేవంత్ రెడ్డి.. ఇద్దరూ ఇద్దరేనని కిషన్ రెడ్డి విమర్శించారు. సైన్యానికి, దేశ ప్రజలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒప్పందాలు కుదిరాయని, అందుకే కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు చేయడం లేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ నేతలు ఎస్.కుమార్, రుద్రమదేవి, భరత్, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాగా, ఆదివారం ఉదయం కృష్ణకాంత్ పార్క్​లో వాకర్స్​ను కిషన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తామెప్పుడూ కార్పెట్ బాంబింగ్ ప్రచారం చేస్తామని అఫీషియల్ గా చెప్పలేదన్నారు. తాము చేస్తున్నది మహా పాదయాత్రలు అని అన్నారు. ఈ ఎన్నికల సమయంలో అజారుద్దీన్​కు ఎందుకు మంత్రి పదవి ఇచ్చారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.