వీడిన చంద్రగ్రహణం..దేశ వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు

వీడిన చంద్రగ్రహణం..దేశ వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు

చంద్ర గ్రహణం తర్వాత దేశవ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్ర గ్రహణం వీడిన తర్వాత  నదీ స్నానాలు చేశారు భక్తులు. ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని దశాశ్వమేధ, సోమేశ్వర్, మీర్, మనికర్ణికా, విష్వేవర్, తులసి, హనుమాన్ స్నాన ఘాట్లు భక్తులతో నిండిపోయాయి. గ్రహణం విడిచిన తర్వాత గంగా నదిలో స్నానాలు చేసి, దీపాలు వెలిగించారు. ఆ తర్వాత దైవ దర్శనం చేసుకున్నారు భక్తులు. .

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని పవిత్ర నదుల నీటితో కడిగారు. ఆ తర్వాత భస్మ హారతి నిర్వహించారు. ప్రత్యేక పూజల తర్వాత మహాకాళేశ్వరుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. 

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు పూజారులు. తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఆలయాన్ని మూసివేశారు అధికారులు. తెల్లవారుజామున చంద్రగ్రహణం వీడింది. దీంతో ఉదయం ఐదు గంటలకే ఆలయ సంప్రోక్షణ  చేపట్టారు పూజారులు. ఆలయ శుద్ది తర్వాత.... స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులను దర్శననానికి అనుమతించారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తలుపులు తెచురుకున్నాయి. చంద్రగ్రహణం తర్వాత శాస్త్రోక్తంగా ఆలయ శుద్ది కార్యక్రమం నిర్వహించారు అర్చకులు.  సంప్రోక్షణ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

Also Read :- ముగిసిన చంద్ర గ్రహణం

పాక్షిక చంద్రగ్రహణం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. తెల్లవారుజామున ఒంటి గంట 5 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాల మధ్య గ్రహణం పూర్తయింది. గ్రహణం విడిచిన తర్వాత  తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల నుంచి ఏకాంతంలో ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆ తర్వాత సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరిచారు. శుద్ది, ప్రత్యేక పూజల తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. గ్రహణం కారణంగా  8 గంటలు  ఆలయ తలుపులు మూసి ఉంచారు.

అక్టోబర్ 28న చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం మూసి వేశారు. ఇవాళ తెల్లవారుజామున గ్రహణం వీడిన తర్వాత ఆలయంలో సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, సుప్రభాత సేవ, ప్రాతక్కాల పూజలు నిర్వహించారు అర్చకులు. అనంతరం ఆలయం తలుపు తెరిచారు. 7 గంటల నుంచి యదావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభమైయ్యారు.

ఏపీ నంద్యాల జిల్లా మహానంది ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం తర్వాత శాస్త్రోక్తంగా ఆలయ శుద్ది, సంప్రోక్షణ పూజలు నిర్వహించారు అర్చకులు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆర్జిత సేవలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు.