ఆసియా అండర్-19 ఫైనల్లో.. పది మంది ఇండియా బాక్సర్లు

ఆసియా అండర్-19 ఫైనల్లో.. పది మంది ఇండియా బాక్సర్లు

బ్యాంకాక్: ఆసియా అండర్-19 బాక్సింగ్ చాంపియన్‌‌‌‌షిప్ లో ఇండియా బాక్సర్లు తమ పంచ్‌‌‌‌లతో అదరగొడుతున్నారు.  మెగా టోర్నీలో పది మంది ఫైనల్ దూసుకెళ్లారు. ఇందులో  ఏడుగురు అమ్మాయిలు.. . ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.  

నిషా (54 కేజీ), ముస్కాన్ (57 కేజీ), వినీ (60 కేజీ), నిషా (65 కేజీ), ఆరతి కుమారి (75 కేజీ), ప్రాచి టోకాస్ (80+ కేజీ).. మెన్స్‌‌‌‌లో మౌసమ్ సుహాగ్ (65 కేజీ), రాహుల్ కుందు (75 కేజీ), హేమంత్ సాంగ్వాన్ (90 కేజీ) స్వర్ణ పతక రేసులో ఉండగా.. కృతికా (80 కేజీ) నేరుగా ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించింది. 

శుక్రవారం జరిగిన 54 కేజీ  సెమీ ఫైనల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో  నిషా 5–0 తో జపాన్‌‌‌‌కు చెందిన హిమరి వతనాబేను చిత్తు చేసింది. వినీ..  చైనా బాక్సర్‌‌‌‌‌‌‌‌ రుయిక్సు లిని ఓడించగా, ఆరతి కుమారి తన ప్రత్యర్థి  థాన్ తుయెన్ ట్రాన్‌‌‌‌ (వియత్నాం)పై పంచ్‌‌‌‌ల వర్షం కురిపించగా, రెండో రౌండ్‌‌‌‌లోనే ఆటను నిలిపివేశారు. 

ప్రాచి 3–2 తో  జక్సీలిక్ సానినా (కజకిస్తాన్‌‌‌‌)పై గెలిచింది. మెన్స్‌‌‌‌లో  సుహాగ్5–0తో ఇరాన్‌‌‌‌కు చెందిన అక్షన్ హషేమిపై విజయం సాధించగా, రాహుల్.. కజక్‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌ షిల్డేబాయ్ నుర్సుల్తాన్‌‌‌‌ ను చిత్తు చేశాడు. 

హేమంత్ సాంగ్వాన్  5–0తో కిరుయ్ హీ (చైనా)పై  గెలిచాడు. కాగా, సెమీస్‌‌‌‌లో ఓడిన యషిక (51 కేజీ), ఆకాంక్ష ఫలస్వాల్ (70 కేజీ), శివమ్ (55 కేజీ), గౌరవ్ (85 కేజీ) కాంస్య పతకాలతో సరిపెట్టారు.