త్వరలో పది వర్సిటీలకు కొత్త వీసీలు

త్వరలో పది వర్సిటీలకు కొత్త వీసీలు
 • ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామకాలకు లైన్ క్లియర్ 
 • రెండు, మూడ్రోజుల్లో సెర్చ్ కమిటీల మీటింగ్స్ 
 • వారం లోపే నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్
 • ఈ నెల 21తో ముగియనున్న వీసీల పదవీకాలం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీల్లో కొత్త వీసీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వీసీల నియామకానికి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం వెంటనే పది వర్సిటీలకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల21తో వీసీల పదవీకాలం ముగియనుండటంతో  అప్పటిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ యోచిస్తున్నది. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో 12 యూనివర్సిటీలు ఉండగా ఆర్జీయూకేటీ

తెలంగాణ మహిళా యూనివర్సిటీ మినహా మిగిలిన 10 వర్సిటీల్లో వీసీల నియామకానికి జనవరిలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఉస్మానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, అంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఈ నెల 21తో ముగియనున్నది. ఆయా వర్సిటీల్లో వీసీ పోస్టుల కోసం 312 మంది నుంచి 1,382 దరఖాస్తులు అందాయి.

మార్చిలోనే వాటి స్ర్కూటినీ పూర్తయింది. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో వీసీల పదవీకాలం దగ్గరపడుతున్న నేపథ్యంలో నియామక ప్రక్రియకు పర్మిషన్ ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రక్రియ కొనసాగించవచ్చని సర్కారుకు ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో ఈ నెల13న పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సర్కార్ పది వర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించింది. 

ఒక్కో కమిటీలో ముగ్గురు.. 

ప్రస్తుతం పది వర్సిటీలకు సెర్చ్ కమిటీలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం నియమించారు. ఒక్కో కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వీరిలో యూజీసీ నామినీ, యూనివర్సిటీ నామినీ, సర్కార్ నామినీ ఉన్నారు. ఈ కమిటీలు సమావేశమై ఆయా వర్సిటీలకు అందిన దరఖాస్తుల నుంచి ముగ్గురి పేర్లను గవర్నర్​కు ప్రతిపాదిస్తాయి.  సర్కార్ సూచనలతో ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్ వీసీగా నియమిస్తారు. ప్రస్తుతం వేసిన సెర్చ్ కమిటీల్లో సర్కార్ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నారు.

సెర్చ్ కమిటీలను రెండు, మూడు రోజుల్లో సమావేశపర్చేందుకు సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే సెర్చ్ కమిటీ సభ్యులకు సమాచారం అందిస్తున్నది. రాలేని పరిస్థితుల్లో ఉంటే ఆన్​లైన్​లో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నది. రెండు లేదా మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నది. ఏవైనా కారణాలతో సెర్చ్ కమిటీల సమావేశాలు ఆలస్యమైతే.. ముందుగా పూర్తయిన సెర్చ్ కమిటీల వివరాలను గవర్నర్ కు పంపించి, ఆయా వర్సిటీలకు వీసీలను ప్రకటించాలని సర్కార్ భావిస్తోంది. 

సెర్చ్ కమిటీలు ఇవే..

ఓయూ

 •  ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ 
 •  ప్రొఫెసర్ అఖిలేశ్ కుమార్ పాండే
 •  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 

తెలంగాణ వర్సిటీ

 •  ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ
 •  ప్రొఫెసర్ రాజేశ్వర్ సింగ్ ఛండేల్
 •  శాంతికుమారి

మహాత్మాగాంధీ వర్సిటీ 

 •  ప్రొఫెసర్ విజయ్ జె పులారి
 •  ప్రొఫెసర్ సట్ ప్రకాశ్ బన్సల్ 
 •  శాంతికుమారి

పాలమూరు వర్సిటీ 

 •  ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ
 •  ప్రొఫెసర్ సాంబశివరావు  శాంతికుమారి

జేఎన్ఏఎఫ్ఏయూ 

 •  ప్రొఫెసర్ తిరుపతిరావు
 •  ప్రొఫెసర్ పంచనాథం  శాంతికుమారి
   

తెలుగు వర్సిటీ  

 •  ప్రొఫెసర్ తిరుపతిరావు  
 • ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ
 •  శాంతికుమారి

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 

 •  ప్రొఫెసర్ వాయునందన్ 
 •  ప్రొఫెసర్ అమీ యు ఉపాధ్యాయ 
 •  శాంతికుమారి

జేఎన్టీయూ

 •  ప్రొఫెసర్ ఎస్ఎన్​హెగ్డే 
 •  ప్రొఫెసర్ జేపీ సింగ్ జూరెల్  
 • శాంతికుమారి