సారీ చెప్పాల్సిందే .. లేకపోతే భారీ ఫైన్

సారీ చెప్పాల్సిందే .. లేకపోతే భారీ ఫైన్

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. సినిమా విషయాల్లోనే కాకుండా ఆయన నిర్వహించిన ‘కాఫీ విత్ కరణ్’టాక్ షో ద్వారా కూడా ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఓ పొరపాటు చేసి గవర్నమెంట్​కు కోపం తెప్పించాడు. రీసెంట్​గా షూటింగ్ నిమిత్తం గోవాలోని ఓ గ్రామానికి వెళ్లింది కరణ్ నిర్మిస్తున్న ఓ మూవీ యూనిట్. షూట్ పూర్తయింది. కానీ టీమ్ ఎక్కడి చెత్తను అక్కడే వదిలివేయడంతో అక్కడి గ్రామస్తులు కోపంతో ఊగిపోయి.. చెత్తతో నిండిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయంపై సీరియస్ అయిన గోవా గవర్నమెంట్ నోటీసులు జారీ చేసింది. వేస్ట్ మేనేజ్మెంట్ మినిస్టర్ మైఖేల్ లోబో మాట్లాడుతూ ‘ధర్మ ప్రొడక్షన్స్‌‌ సిబ్బంది షూటింగ్ పేరుతో నిరుల్ గ్రామాన్ని చెత్తమయం చేశారు.  శుభ్రం చేయకుండా వెళ్లినందుకు వారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా తమ తప్పు ఒప్పుకోవాలి. లేదంటే వారికి భారీ ఫైన్ విధిస్తాం’ అన్నారు. దానికి లైన్స్‌‌ ప్రొడ్యూసర్‌‌ దిలీప్‌‌.. ‘మేము నిరుల్‌‌ ప్రాంతంలో షూటింగ్‌‌ చేశాం. ప్రతి రోజు సేకరించిన  చెత్తను పంచాయతీ సిబ్బంది వచ్చి తీసుకెళ్లేవారు. కానీ ఆదివారం మాత్రం తీసుకెళ్లలేదు’ అని సమాధానమిచ్చాడు. అయినా సరే కరణ్ జోహర్ సారీ చెప్పాల్సిందేనంటూ ఆ ఊరివారితో పాటు నెటిజన్స్ కూడా పట్టుబడుతున్నారు. దాంతో నిర్మాత కరణ్ దిగి రాక తప్పేలా లేదు.