
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణాలకు టెండర్లు ఖరారయ్యాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిర్మించనున్న గురుకుల టెండర్‌ను కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ దక్కించుకుంది. ఖమ్మం జిల్లా మధిర గురుకుల టెండర్ బీపీఆర్ ఇన్‌ఫ్రాకు దక్కింది. 25 ఎకరాల్లో నిర్మించనున్న తొలిదశ ఇంటిగ్రేటెడ్ గురుకురాల బిల్డింగ్ పనులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని టెండర్ అగ్రిమెంట్‌లో కార్పొరేషన్ స్పష్టం చేయనుంది.
కొడంగల్ గురుకులానికి రూ.140.65 కోట్లు, మధిర గురుకులానికి రూ.138.55 కోట్లు, హుజూర్ నగర్ గురుకులానికి రూ.136.01 కోట్లతో టెండర్లు పిలవగా.. 4 శాతం తక్కువకు కంపెనీ కోట్ చేసి టెండర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఆ కంపెనీలతో కార్పొరేషన్ అగ్రిమెంట్ చేసుకోనుంది. అలాగే, గురుకులాల బిల్డింగ్ నిర్మాణాలకు సంబంధించి స్థలాలను కూడా స్వాధీనం చేసుకొని పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
హుజూర్‌నగర్‌లో ఎంపిక చేసిన స్థలం నిర్మాణానికి అనుగుణంగా లేదని అధికారుల తనిఖీలో తేలిందని, త్వరలో ప్రత్యామ్నాయ స్థలాన్ని అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 1న కొడంగల్, మధిర, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) టెండర్లు పిలిచింది.
కాగా, గతంలో ఈ మూడు గురుకులాలకు మూడు కంపెనీలు మాత్రమే టెండర్లు దాఖలు చేయడంతో సింగిల్ టెండర్లను రద్దుచేసి మరోసారి టెండర్లు పిలవగా ఆరు కంపెనీలు దాఖలు చేశాయి. ఈ టెండర్లను సీవోటీ (కమిషనరేట్ ఆఫ్ టెండర్స్)కి పంపగా తాజాగా ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 14 నియోజకవర్గాల్లో టెండర్లు పిలవగా త్వరలో వీటిని కార్పొరేషన్ అధికారులు ఓపెన్ చేసి సీవోటీకి పంపనున్నారు.