కొత్త మున్సిపాలిటీల్లో పదిరెట్లు పెరిగిన ప్రాపర్టీ ట్యాక్సులు

కొత్త మున్సిపాలిటీల్లో పదిరెట్లు పెరిగిన ప్రాపర్టీ ట్యాక్సులు

కరీంనగర్ / వనపర్తి, వెలుగు: గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండి 2018 ఆగస్టు తర్వాత  అప్​గ్రేడ్​ అయిన కొత్త మున్సిపాలిటీల్లో పన్నుల మోత మోగుతున్నది. సగటున 40 శాతం ఆస్తి పన్ను పెరిగిందని ఆఫీసర్లు చెప్తున్నా.. భువన్​సర్వే పుణ్యమా అని10 నుంచి 20 రెట్లు పెరిగిన వాళ్లూ ఉన్నారు. కూలినాలి చేసుకొని బతికే తాము ఇంత పెద్దమొత్తంలో పన్నులు ఎలా కట్టగలమని బాధితులు వాపోతున్నారు. నిజానికి ఎలాంటి ఆదాయ వనరులు లేని పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌‌గ్రేడ్ చేయడాన్ని అప్పట్లో జనం తీవ్రంగా వ్యతిరేకించారు. పంచాయతీలతో పోలిస్తే పట్టణాల్లో పన్నులు ఎక్కువని, ఆ భారం తాము మోయలేమని అభ్యంతరం తెలిపారు. కానీ మూడేండ్ల దాకా పాత పన్నులే వసూలు చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. ఆ గడువు ముగియడంతో ఈ నెల నుంచి ప్రాపర్టీ పన్నులు పెంచింది. భువన్ సర్వే నిర్వహించి, కనీసం తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా మున్సిపల్ ఆఫీసర్లు కొత్త పన్నులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని జనం ప్రశ్నిస్తున్నారు.

ఎలాంటి అభివృద్ధి చేయకున్నా..

రాష్ట్రంలో ప్రస్తుతం 141 అర్బన్ లోకల్​బాడీస్ ఉన్నాయి. 2018కి ముందు వీటి సంఖ్య 69 కాగా, 2018, 19 సంవత్సరాల్లో 72 గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్​గ్రేడ్ చేసింది. పట్టణాలుగా మార్చడం వల్ల తాము ఉపాధి హామీ పనులు కోల్పోతామని, టాక్సులు పెరుగుతాయని జనం ఆందోళన చేసినా సర్కారు పట్టించుకోలేదు. నాడు బలవంతంగా విలీనం చేసిన గ్రామాలు.. పేరుకు మున్సిపాలిటీలు అయ్యాయే తప్ప అభివృద్ధి జరగలేదు. ఇప్పటికీ ఆయా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేవు. మిషన్ భగీరథ పైప్ లైన్ తవ్వకాలతో దెబ్బతిన్న రోడ్లను రిపేర్లు చేయలేని పరిస్థితిలో దయనీయంగా ఉన్నాయి. ప్రజల ఆందోళన నేపథ్యంలో మొదటి మూడేండ్లు ట్యాక్స్​లు పెంచబోమని సర్కారు చెప్పింది. మూడేండ్లు పూర్తవడంతో అక్టోబర్ నుంచి పన్నుల మోత మోగిస్తున్నది. ఉదాహరణకు కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఎల్లారెడ్డిలో ఈ నెల కమర్షియల్ విభాగంలో ప్రాపర్టీ టాక్స్​సగటున 50 శాతానికి మించి పెరిగింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌‌‌‌లో భువన్ సర్వే తర్వాత ఈ నెలలో ఇప్పటికే రూ.22 లక్షల అదనపు ఆదాయం వచ్చినట్లు మున్సిపల్ ఆఫీసర్లు చెప్తున్నారు. కరీంనగర్​ జిల్లాలోని చొప్పదండి మున్సిపాలిటీలో ఓ వ్యక్తికి 6 నెలల ఇంటి పన్ను రూ.950 రాగా, ఈ నెల మాత్రం రూ.25 వేలు వచ్చింది. మరో వ్యక్తికి కమర్షియల్ ​విభాగంలో గతంలో 6 నెలలకు రూ.7,500 ఇంటి పన్ను రాగా, ఈ సారి రూ.39 వేల పన్ను వేశారు. దీంతో చొప్పదండి మున్సిపాలిటీలోని ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, ప్రజలు ఈ నెల 18 నుంచి 26 వరకు నిరసన తెలిపి 27న చొప్పదండి స్వచ్ఛంద బంద్‌‌కు పిలుపునిచ్చారు. 28 నుంచి రిలే దీక్షలకు రెడీ అవుతున్నారు.

భువన్​సర్వే తీరుపై విమర్శలు

పారిశుధ్య కార్మికులకు ప్రతి నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల పెంపునకు సర్కారు ప్లాన్​ వేసింది. దీంతో నాలుగైదు నెలలపాటు ప్రైవేట్ ఏజెన్సీలతో అన్ని మున్సిపాలిటీల్లో భువన్​ సర్వే చేయించింది. ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్​లు, వాటి పక్కనున్న ఓపెన్ ఏరియా కొలతలను తీసుకొని ఆన్​లైన్‌‌లో అప్‌‌లోడ్ చేశారు. ఏజెన్సీ ప్రతినిధులు పని ఒత్తిడి కారణంగా చాలా ఇండ్ల కొలతలు సరిగ్గా తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏజెన్సీలు అనుభవం లేని వ్యక్తులను నియమించుకొని ఇంటి నంబర్ల ఆధారంగా ఇండ్లు, షాపులకు వెళ్లి నిర్మాణాల కొలతలు, ఇండ్ల ముందు ఉన్న ఓపెన్​ల్యాండ్స్​మెజర్​మెంట్స్ ను హడావుడిగా సేకరించి, ఆన్​లైన్ చేశాయనే ఫిర్యాదులు వచ్చాయి. అదే సమయంలో కమీషన్లు తీసుకొని భారీ షాపింగ్ కాంప్లెక్స్ లు, ప్రైవేట్ విద్య, వైద్య సంస్థల బిల్డింగులకు మొక్కుబడిగా కొలతలు నమోదు చేశారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ప్రకారం ఆయా వార్డుల్లో ట్యాక్స్ లను నిర్ధారించే వారు. ప్రస్తుతం అవేమీ పట్టించుకోకుండా ఆన్​లైన్​లోనే ఫైనల్ ట్యాక్స్ అప్రూవల్ ఇయ్యడం వివాదాస్పదమవుతున్నది.

చిన్న ఇంటికి అంత టాక్సా?

నాకు గతేడాది ఆరు నెలలకు 600 చొప్పున ఇంటి పన్ను​వచ్చింది. కానీ ఈ సారి రూ.వెయ్యి వేశారు. మున్సిపల్ ఆఫీసర్లను అడిగితే భువన్ సర్వే తర్వాత ఇంటి కొలతలు మారిపో యాయని, అందరికీ టాక్స్ పెరిగిందని చెప్పారు. నా చిన్న ఇంటికి ఏడాదికి 2 వేల టాక్స్ కట్టాలంటే కష్టమైతుంది.
‌‌- రాజన్న, ఖానాపూర్, నిర్మల్ జిల్లా

సర్కార్ నిలువు దోపిడీ

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో కొత్తగా తీసుకువచ్చిన పన్నుల విధానం ప్రజలను, చిరు వ్యాపారులను నిలువు దోపిడీ చేసేలా ఉంది. చాలా చోట్ల 40 శాతం నుంచి వంద శాతం దాకా ఆస్తి పన్ను పెంచారు. మున్సిపాలిటీల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచకుండా పన్నులు పెంచితే ఎట్లా? ఖాళీ స్థలాలకు పన్నులు వసూలు చేయడమంటే రక్తం తాగడమే. పెంచిన పన్నులు తగ్గించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 
 - యుగంధర్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కొత్తకోట, వనపర్తి జిల్లా