
టెన్నిస్ కోచ్ అని పరిచయం చేసుకుంటాడు. మీ పిల్లలకు నేర్పిస్తానంటాడు. అతడి మాటలు నమ్మిన తల్లిదండ్రులు కోచింగ్ కు పంపిస్తారు. ఇలా రోజూ పిల్లలను టెన్నిస్ కోర్టుకు తీసుకెళ్లి ఆట నేర్పిస్తాడు. చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోని బంగారు నగలను, విలువైన వస్తువులను ఎత్తుకెళ్తాడు. ఇలా చోరీలకు పాల్పడుతున్న టెన్నీస్కోచ్ను కేపీహెచ్ బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్ బీ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావుతో కలిసి వివరాలు వెల్లడించారు. రాజమండ్రి సుబ్బరావుపేటకు చెందిన కోమలి రామకృష్ణ(24) కేపీహెచ్ బీ పీఎస్పరిధిలోని శాతవాహననగర్ ఉంటున్నాడు. జలవాయు విహార్‌లోని టెన్నిస్ కోర్టులో కోచ్ గా పనిచేస్తున్నాడు. టెన్నిస్ కోచ్ అంటూ కేపీహెచ్‌బీకాలనీ సర్దార్‌పటేల్‌నగర్‌లోని ఓ కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు. వారి పిల్లలను ప్రతి రోజు టెన్నిస్నేర్పించేందుకు కోర్టుకు తీసుకువెళ్లి అయిపోగానే తిరిగి ఇంటి దగ్గర వదిలి పెట్టేవాడు. అయితే ఏప్రిల్ 24వ తేదీన చిన్నారులతో కలిసి ఆ కుటుంబం దైవ దర్శనానికి వెళ్లింది. దొంగతనం చేసేందుకు అదే అదనుగా భావించిన రామకృష్ణ 27వ తేదీన అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో బాధితులు వెంటనే కేపీహెచ్ బీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. రామకృష్ణ 2018లో కేపీహెచ్ బీలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి ఎల్ఈడీ టీవీ, మిక్సీని ఎత్తుకెళ్లాడు.
దొరికాడు ఇలా..
బుధవారం ఉదయం 7 గంటలకు కేపీహెచ్‌బీ పోలీసులు సర్దార్‌పటేల్‌నగర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రామకృష్ణ అనుమానాస్పదంగా తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతని నుంచి రూ.5లక్షల విలువ గల 11.5 తులాల బంగారం, 2.5 కేజీల వెండి, ద్విచక్రవాహనం, మిక్సీ, ఎల్ఈడీ టీవీని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
జైలుకెళ్లొచ్చినా..
గతంలో రామకృష్ణపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో 4 కేసులు, ధవళేశ్వరం పీఎస్‌లో ఒక కేసు, రాజానగరం పీఎస్‌లో ఒక కేసు నమోదై ఉన్నాయి. వీటితోపాటు కేపీహెచ్ బీ పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వివిధ కేసుల్లో రామకృష్ణ జైలుకు వెళ్లొచ్చాడు. అయినా అతని తీరులో మార్పు రాలేదు. జీతం సరిపోకనే చోరీల బాటపట్టిపట్లు పోలీసులు తెలిపారు. కేసును చేధించడంలో ప్రతిభ కనబర్చిన క్రైమ్ సిబ్బంది పూర్ణదాస్, ఎం.కె.నవీన్కాంత్లను డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ లక్ష్మీనారాయణ, డీఐ సైదులు, డీఎస్ఐలు హరిశంకర్, రాంచంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.