టెన్నిస్కు అమెరికా నల్లకలువ రిటైర్మెంట్

టెన్నిస్కు అమెరికా నల్లకలువ రిటైర్మెంట్

టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించింది.  యుఎస్ ఓపెన్ తర్వాత  టెన్నిస్‌కు దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించింది.  ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం అనే  పదం కంటే..తన జీవితంలో ఇతర ముఖ్యమైన అంశాలపై ఫోకస్ పెట్టబోతున్నానని..అందుకే ఆటకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపింది.  కొన్ని సంవత్సరాల క్రితం తాను వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన సెరెనా వెంచర్స్‌ను  ప్రారంభించానని.. అలాగే తన కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలనుకుంటున్నట్లు  సెరీనా పేర్కొంది. 

యూఎస్ ఓపెన్ గెలిచేందుకు ట్రై చేస్తా..
దురదృష్టవశాత్తూ నేను వింబుల్డన్ గెలవలేకపోయా. మొదటి రౌండ్‌లో హార్మొనీ టాన్ చేతిలో ఓడిపోయా. అయితే యూఎస్ ఓపెన్ ను గెలుస్తానో లేదో తెలియదు. కానీ ప్రయత్నిస్తా.  లండన్‌లో మార్గరెట్‌ రికార్డును అందుకోలేకపోవచ్చు. కానీ  న్యూయార్క్‌లో ఆమె రికార్డును అధిగమించేందుకు ప్రయత్నం చేస్తా...అని సెరీనా వెల్లడించింది. 

ఓపెన్ ఎరాలో ఏకైక ప్లేయర్..
40 ఏళ్ల సెరీనా విలియమ్స్..23 గ్రాండ్  గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది.  ఓపెన్ ఎరాలో అత్యధికం గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ప్లేయర్గా సెరీనా రికార్డులకెక్కింది. అలాగే టెన్నిస్ చరిత్రలో 23 టైటిల్స్ సాధించిన రెండో ప్లేయర్గా రికార్డు సృష్టించింది.  ఆమె కంటే ముందు మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో మొదటి స్థానంలో ఉంది. 

గ్రాండ్ స్లామ్స్..
సెరీనా ఇప్పటి వరకు 7 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు, మూడు సార్లు ఫ్రెంచ్ ఓపెన్, 7 సార్లు వింబుల్డన్ టైటిల్స్ను దక్కించుకుంది. అలాగే యుఎస్ ఓపెన్ లో 6 సార్లు విజేతగా నిలిచింది. అక్కడ వీనస్ విలియమ్స్తో కలిసి  సెరీనా.. 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌లను గెలిచింది. 

నెంబర్ వన్ ర్యాంకు..
సెరెనా విలియమ్స్ 319 వారాల పాటు WTA ర్యాంకింగ్స్లో  వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగింది.  వరుసగా 186  వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో నిలిచి రికార్డులకెక్కింది.