బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితులేం బాలేవు

బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితులేం బాలేవు

విద్యార్థి ఆత్మహత్యతో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి తండాకు చెందిన రాథోడ్ సురేశ్ హాస్టల్ రూంలో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. క్యాంపస్ లో సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ సురేష్ కి విద్యార్థులు నివాళులర్పించారు. సురేష్ మృతిపై పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సురేష్ సూసైడ్ విషయం చెప్తే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి ట్రిపుల్ ఐటీ మెయిన్ గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై టూర్ తర్వాత.. క్యాంపస్ లో ఆంక్షలు ఎక్కువయ్యాయని స్టూడెంట్స్ ఆరోపించారు. ఇవాళ విద్యాసంస్థల బంద్ పాటించాలని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. క్యాంపస్ లో పోలీసులను పెద్దఎత్తున మోహరించారు. 

డిచ్ పల్లి తండాలో విషాదఛాయలు 

సురేశ్ మృతితో అతని సొంతూరు డిచ్ పల్లి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో సురేశ్ డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేసి.. డిచ్ పల్లి తండాకు తరలించారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సురేశ్ మృతికి ట్రిపుల్ ఐటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు అతని తండ్రి గంగారాం రాథోడ్. తన కొడుకుకు ఎలాంటి వ్యక్తిగత ఇబ్బందులు లేవని, తమకు ఆర్థిక సమస్యలు కూడా లేవన్నారు. చదువులోనూ సురేశ్ ముందుండేవాడని చెప్పారు. సురేశ్ ను క్యాంపస్ నుంచి భైంసాకు, అక్కడి నుంచి నిర్మల్ కు తరలించారని, సూసైడ్ చేసుకున్నట్లు, ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. హాస్టల్ రూంలో సూసైడ్ నోట్ కూడా ఉన్నట్లు తెలిసిందని, దానిని పోలీసులు, అధికారులు ఎక్కడ దాచారో చెప్పాలన్నారు. సురేశ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పేరెంట్స్ అంటున్నారు.

బాధ్యత వహించాలె

బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు బాగా లేవన్నారు సీపీఐ నేత నారాయణ. వర్శిటీలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్నారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలని నారాయణ డిమాండ్ చేశారు.