మళ్లీ మొదటికి.. మణిపూర్లో ఉద్రిక్తత

మళ్లీ మొదటికి.. మణిపూర్లో ఉద్రిక్తత
  • రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన స్టూడెంట్లు
  • అడ్డుకున్న పోలీసులు.. 40 మంది విద్యార్థులకు గాయాలు

మణిపూర్​లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ, స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్​ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇంఫాల్​లో స్టూడెంట్లు చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 40 మంది స్టూడెంట్స్​ గాయపడ్డారు.

న్యూఢిల్లీ: మణిపూర్​లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇంఫాల్​లో స్టూడెంట్లు చేపట్టిన రాజ్​భవన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్​ను కంట్రోల్ చేయడంలో డీజీపీ, స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ విఫలమయ్యారని.. వాళ్లిద్దరినీ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్లు మంగళవారం రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టూడెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల పైకి స్టూడెంట్లు రాళ్లు రువ్వారు. స్టూడెంట్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 40 మందికి పైగా స్టూడెంట్లకు గాయాలయ్యాయి. వాళ్లందరినీ ఆస్పత్రిలో చేర్పించి, ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. కాగా, మణిపూర్​లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్​ను ఐదు రోజుల పాటు బంద్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 15 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అలాగే ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, థౌబల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. మరోవైపు అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. 2 వేల మంది సీఆర్ పీఎఫ్ జవాన్లను మణిపూర్​కు పంపించాలని ఆదేశాలిచ్చింది. తెలంగాణలోని వరంగల్ నుంచి ఒక బెటాలియన్, జార్ఖండ్ నుంచి మరో బెటాలియన్​ను పంపిస్తున్నది. 

ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఫైర్.. 

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. ‘‘ప్రధాని మోదీ ప్రపంచమంతటా పర్యటిస్తున్నారు. కానీ ఆయనకు మణిపూర్​కు రావడానికి మాత్రం టైమ్ లేదా? మణిపూర్​లో అల్లర్లు చెలరేగి ఏడాది దాటింది. కానీ అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. మణిపూర్ మండిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. అందుకే ఆయన పట్టించుకోవడం లేదు” అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ మండిపడ్డారు.

Also Read:-71 వేల 744 కోట్ల గ్రాంట్​ కావాలి