శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత

శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత
  • కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం చేసిన గంటల్లోనే ఆందోళన
     

కొలంబో: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక సంక్షోభంతో  కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా  రణీల్  విక్రమ సింఘే ప్రమాణ  స్వీకారం చేసిన  కొద్ది గంటల్లోనే  ఆందోళనలు వెల్లువెత్తాయి. అర్ధరాత్రి  కొలొంబోలోని  అధ్యక్ష భవనాన్ని ముట్టడించేందుకు యత్నించారు  ఆందోళనకారులు. దీంతో  వారిను అడ్డుకున్నారు భద్రతా బలగాలు. వందల మంది ఒక్కసారిగా ముట్టడికి ప్రయత్నించగా.. పోలీసులు, భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేశాయి. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన  నిరసనకారులకు  చెందిన పలు టెంట్లను తొలగించారు. 

అధ్యక్షుడి సెక్రెటేరియట్ భవనం ముందు నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు అధికారులు. కాగా...తాము వెనక్కి వెళ్లేదే లేదని స్పష్టం చేశారు నిరసనకారులు. ఏప్రిల్  9 నుంచి అధ్యక్షుడి కార్యాలయం ఎంట్రీని దిగ్బంధించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకు పోరాడతామని తెలిపారు. ఏప్రిల్ నుంచి వేలాది మంది ప్రభుత్వ నిరసనకారులకు అవసరమైన సామగ్రి అందించేందుకు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధ్యక్ష భవనం  సమీపంలో తమకు నిరసనలు చేపట్టేందుకు  ప్లేస్ చూపించాలని  డిమాండ్  చేశారు. విక్రమసింఘే  తమను చెదరగొట్టాలని  చూస్తున్నారని... కానీ అతడ్ని పదవి నుంచి దింపే వరకు పోరాడతామని స్పష్టం చేశారు నిరసనకారులు. విక్రమసింఘే రాజీనామా చేసేవరకు నిరసనలు ఆగవని ఆందోళనకారులు స్పష్టం చేశారు.


శ్రీలంకకు సాయం చేసేందుకు ముందుకు రావాలి: ఐక్యరాజ్య సమితి
మరోవైపు శ్రీలంక  ప్రజలకు  వెంటనే సాయం చేయాలని తెలిపింది ఐక్యరాజ్య సమితి  మానవ హక్కుల  నిపుణుల బృందం. అంతర్జాతీయ సమాజం ముందుకు  వచ్చి సాయం  అందించాలని సూచించింది. శ్రీలంకలోని పరిస్థితులపై  ఆందోళన వ్యక్తం చేశారు మానవ హక్కుల నిపుణులు. కేవలం మానవతా సంస్థల నుంచే కాదు.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రైవేటు  లెండర్స్, ఇతర దేశాలు ముందుకు రావాలంది ఐక్యరాజ్యసమితి. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు తీసుకునే నిర్ణయాల్లో మానవ  హక్కులను ప్రధానంగా చూడాలన్నారు.ప్రభుత్వం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలవల్లే సంక్షోభం తలెత్తిందన్నారు హ్యూమన్ రైట్స్ అధికారులు.