
- మాస్టర్ ప్లాన్‍లో మరోసారి రోడ్ల విస్తరణకు ఆమోదం
- డిసెంబర్‍లో ముసాయిదాను ఓకే చేసిన కౌన్సిల్
- మార్చి 31 నాటికి పూర్తి ప్లాన్ రూపొందించాలని నిర్ణయం
- గతంలో రోడ్లు, డ్రైనేజీలు వెడల్పు చేసినా పరిహారమియ్యలే
- ఇప్పుడేమో ప్లాన్ ఆమోదం పొందకముందే నోటీసులు
- మరోసారి ఇండ్లు, స్థలాలు పోతాయనే ఆందోళనలో జనాలు
వరంగల్/వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ తుది మాస్టర్ ప్లాన్‍కు ఆమోదముద్ర పడకుండానే..అభివృద్ధి పనుల పేరుతో రైతులకు నోటీసులివ్వడం స్థానిక జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్లు, డ్రైనేజీల విస్తరణ పేరుతో ఇప్పటికే పట్టణంలోని ఇండ్లను కూల్చేసిన ఆఫీసర్లు, పైసా పరిహారం ఇవ్వకుండానే కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో మూడోసారి రోడ్ల విస్తరణకు ఆమోదముద్ర వేశారు. తుది మాస్టర్ ప్లాన్ మార్చి 31 నాటికి వరకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు మొదలయ్యే చోట ముగ్గురు రైతులకు బలవంతంగా నోటీసులు ఇవ్వడంతో మిగతా రైతులతో పాటు స్థానికుల్లో టెన్షన్ షురువైంది.
కొత్త మాస్టర్ ప్లాన్‍లో..మరోసారి రోడ్ల వెడల్పు
వర్ధన్నపేట మున్సిపాలిటీకి కొత్తగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను డిసెంబర్ 29న మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్ లో ఆమోదించారు. వచ్చే మార్చి 31 నాటికి తుది ప్లాన్ పూర్తి చేయాలని సూచించారు. ఇందులో మరోసారి పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టేలా ప్రణాళిక రెడీ చేశారు. వర్ధన్నపేట మీదుగా ఉండే వరంగల్–- ఖమ్మం నేషనల్ హైవే ఎన్ హెచ్-563 ని 200 అడుగులకు.. వర్ధన్నపేట –జాఫర్గఢ్రోడ్డును 100 అడుగులకు.. వర్ధన్నపేట టౌన్చుట్టూరా ఉండే రోడ్లను 40, 60 అడుగుల మేరకు విస్తరించరించాలని మాస్టర్ ప్లాన్‍లో ప్లాన్లు రూపొందించారు. ఈ వివరాలు ఇప్పుడు బయటకు రావడంతో జనాల్లో ఆందోళన మొదలైంది.
గతంలో కూల్చిన ఇండ్ల పరిహారం ఇంకా ఇయ్యలే
వరంగల్ -–ఖమ్మం హైవేలోని వర్ధన్నపేట పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల పేరుతో గతేడాది రోడ్లకు ఇరువైపులా ఉన్న ఇండ్లను కూల్చివేశారు. దీనికిముందు కాంగ్రెస్ హయాంలోనూ వర్ధన్నపేట–జాఫర్గఢ్రోడ్డును విస్తరించడానికి ఇండ్లను పడగొట్టారు. రెండుసార్లుఈ రోడ్ల వెంట ఉన్న పబ్లిక్తమ ఇండ్లు, స్థలాలను కోల్పోయారు. అయితే, లీడర్లు బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పినా.. ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో కొత్త మాస్టర్ ప్లాన్‍లో భాగంగా మళ్లీ రోడ్ల వెడల్పుకు కౌన్సిల్ ఆమోదం తెలపడంతో..అధికారులు మళ్లీ తమ నివాసాలను పడగొడతారేమోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే తాము రోడ్లపై పడాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం పాత ఇండ్లను కూలగొట్టబోమని, కొత్తగా ఇండ్లు కట్టుకునేవాళ్లు మాత్రం మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని ప్రజలు పెద్దగా నమ్మడం లేదు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కొన్ని నెలలపాటు ఆగినా..తర్వాత కూలగొట్టబోరన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ప్లాన్ రాక ముందే రైతులకు నోటీసులు
మున్సిపాలిటీ పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్‍కు గ్రీన్ సిగ్నల్ రాకముందే పలువురు రైతులకు నోటీసులివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వర్ధన్నపేట తహసీల్దార్ఆఫీసు పక్కనుంచి రోడ్డు వేస్తామని..మాస్టర్ ప్లాన్ లో ప్రణాళిక కూడా రూపొందించామని కమిషనర్ చెప్పుకొచ్చారు. 802, 806, 810, 812, 813 సహా వివిధ సర్వే నంబర్లలో ఉన్న రైతులకు రోడ్డు ఏర్పాటు గురించి డిసెంబర్ మూడో వారంలోనే నోటీసులిచ్చారు. కాగా, డ్రాఫ్ట్ ప్లాన్ రాకముందే నోటీసులెలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా 802, 806 సర్వే నంబర్లపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందని, ఇదే విషయాన్ని మున్సిపల్ అధికారులకు వివరించినా పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన
చెందుతున్నారు.
మాస్టర్ ప్లాన్ రాకముందే నోటీసులు
మాస్టర్ ప్లాన్ రాకముందే మా భూమిలోంచి రోడ్డు వేస్తామని కమిషనర్ చెబుతున్నారు. ఆ భూములపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పినా వినడంలేదు. మాకు సమాచారం ఇవ్వకుండానే మా భూమిని జేసీబీతో క్లీన్ చేయించారు. ఇదేంటని అడిగితే దురుసుగా మాట్లాడారు. మాకు సమాచారం ఇవ్వకుండా మా ఇంటిముందు గోడపై నోటీసు అతికించి వెళ్లారు. -కేబీ రంజన్ కుమార్ (బాధితుడు)
మా పొలాలపై కోర్డు ఇంజక్షన్ అర్డర్ ఉంది
తహసీల్దార్ ఆఫీస్ పక్కనుంచి మా పొలాల మీదుగా రోడ్డు వేస్తున్నామంటూ మున్సిపాలిటీ సిబ్బంది మా ఇంటికొచ్చి నాకు చెప్పకుండా నా ఫొటోలు తీసుకున్నారు. నా భూమిలో నుంచి రోడ్డు వేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోయినా పర్మిషన్ ఇచ్చారని గ్రామంలో ప్రచారం చేశారు. మా భూమిలోకి మా కుటుంబానికి తప్ప వేరే ఎవరికి అనుమతి లేదని కోర్టు ఇంజక్షన్ అర్డర్ ఉందన్నవిషయం మున్సిపల్ఆఫీసర్లకు చెప్పినా వినడంలేదు.
- అచ్చి కమాలదేవి (బాధితురాలు)
మళ్లీ ఇండ్లు కూలుస్తామంటే ఒప్పుకోం
కొత్త మాస్లర్ ప్లాన్ ప్రకారం వర్ధన్నపేట నుంచి జాఫర్‌గఢ్ రోడ్డు వెడల్పు చేస్తామంటున్నారు. ఇదే ఉద్దేశముంటే మేము ఇండ్లు కట్టుకున్నప్పుడు ఎందుకు చెప్పలేదు. ఆమోదముద్ర ఉందనే పేరుతో మళ్లీ ఇండ్లు కూలుస్తామంటే ఒప్పుకోం. దీనివల్ల మేము తీవ్రంగా నష్టపోతాం. - ఏనుగుల రజిత