హైదరాబాద్ : నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ దగ్గర ఉదయం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ – ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఇంటర్ బోర్డ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ABVP ముట్టడి పిలుపుతో ఇంటర్ బోర్డ్ దగ్గర బందోబస్తు పెంచారు. విద్యార్థి నాయకులు ఇంటర్ బోర్డ్ ఆఫీస్ లోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొద్దిసేపు అక్కడ తోపులాట జరగడంతో… పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు… అక్కడినుంచి బలవంతంగా మరో చోటకు తీసుకెళ్లారు.
ఇంటర్మీడియట్ మార్కుల షీట్ లో తప్పులకు నిరసనగా నాంపల్లి లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఏబీవీపీ నాయకులు. ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలకు పూర్తి బాధ్యత వహిస్తూ బోర్డు కార్యదర్శి అశోక్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా పేపర్ రివాల్యూవేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు ఏబీవీపీ నాయకులు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల మరియు తల్లిదండ్రులతో చెలగాటం ఆడుతున్న ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని ఆందోళన చేశారు.
