కోర్టులో వాదనలు.. బయట ఆందోళనలు

కోర్టులో వాదనలు.. బయట ఆందోళనలు

హైదరాబాద్:  నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ తో కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు రాజాసింగ్ అరెస్ట్ కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు బయట బీజేపీ, ఎంఐఎం కార్యకర్త పోటాపోటీ నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరుపార్టీల కార్యకర్తలు, అనుచరులు భారీగా తరలిరావడంతో నాంపల్లి కోర్టు పరిసరాలన్నీ  కిక్కిరిసిపోయాయి.  దీంతో పోలీసులు  లాఠీలకు పనికల్పించారు. గుమిగూడిన ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. 

పోలీసులు - కార్యకర్తల మధ్య తోపులాట

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు.. కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో ఎంఐఎం, బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులు ముందు జాగ్రత్తగా కోర్టుకు చాలా దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ భద్రత మధ్య బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో రాజాసింగ్ ను నాంపల్లి కోర్టుకు తరలించారు. 
రాజాసింగ్ కోసం కోర్టు ఆవరణలోకి వచ్చిన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అనుచరులు రాజాసింగ్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు-కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడం ఉద్రిక్తతకు దారితీసింది.

బందోబస్తు నడుమ రాజాసింగ్ ను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టినందుకు IPC సెక్షన్ 153(A)  కేసు నమోదు చేశారు. అలాగే మతవిశ్వాసాలను కించపర్చినందుకు సెక్షన్ 295-A.. ప్రకటనల ద్వారా నష్టం కలిగించినందుకు 295-A.. బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో వాదనలు వాడీవేడీగా జరుగుతున్నాయి. మరికాసేపట్లో న్యాయమూర్తి తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా తరలివచ్చి నినాదాలు చేస్తున్న బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.