
డిచ్పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని అమృతపురంలో ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ రూరల్అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారానికి రాగా, గ్రామానికి చెందిన యువకులు సమస్యలపై ప్రశ్నించేందుకు యత్నించారు. వీరిని బీఆర్ఎస్ లీడర్లు వారించారు. విషయం తెలుసుకున్న డిచ్పల్లి సీఐ కృష్ణ వెంటనే అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఇద్దరు యువకులపై చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులకు, యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన తమపై సీఐ దాడి చేశారని యువకులు వాపోయారు. సీఐ కృష్ణ బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై సీఐ కృష్ణను వివరణ కోరగా సదరు యువకులు ఉద్దేశపూర్వకంగా పార్టీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రావడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే మినిమం ఫోర్స్ఉపయోగించాల్సి వచ్చిందన్నారు.