కోల్కతాలో టెన్షన్ టెన్షన్..ఆర్జీకర్  అత్యాచార ఘటనకు ఏడాది.. మహిళల భారీ ర్యాలీ

కోల్కతాలో టెన్షన్ టెన్షన్..ఆర్జీకర్  అత్యాచార ఘటనకు ఏడాది.. మహిళల భారీ ర్యాలీ
  • ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్

కోల్​కతా: ఆర్జీకర్ వైద్యురాలి అత్యాచార ఘటనకు ఏడాది పూర్తయినా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదంటూ కోల్ కతాలో మహిళలు రోడ్డెక్కారు. భారీ సంఖ్యలో మహిళలు ర్యాలీగా సీఎం మమతా బెనర్జీ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో ఆర్జీకర్ వైద్యురాలి తల్లికి నుదుటిపై గాయమైంది.

చాలామంది మహిళలకు లాఠీ దెబ్బలు తగిలాయని, కోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారని బాధితురాలి తల్లిదండ్రులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆఫీసుకు వెళ్లి సీఎం మమతా బెనర్జీని కలుసుకుంటామని, తన కూతురుపై జరిగిన దారుణానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. కాగా, గతేడాది కోల్​కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్ పై దుండగులు అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆసుపత్రిలో వైద్యులు విశ్రాంతి తీసుకునే గదిలోనే ఈ దారుణం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడింది పోలీస్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్​గా తేల్చిన న్యాయస్థానం.. రాయ్ కి జీవిత ఖైదు విధించింది.