కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత .. ఎన్ఎస్‌యూఐ దాడి పిలుపుతో హై టెన్షన్

కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత .. ఎన్ఎస్‌యూఐ దాడి పిలుపుతో హై టెన్షన్

గచ్చిబౌలి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి ఎన్ఎస్‌యూఐ పిలుపునివ్వడంతో శనివారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి నివాసం ఉన్న కొల్ల లగ్జరీయా విల్లాస్ వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించారు. కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే డా. సంజయ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనకు మద్దతు తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా అసత్య ప్రచారాలు చేస్తే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కాగా.. కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్ఎస్‌యూఐ నాయకులు శనివారం ఉదయం కొత్తగూడెం చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.