నాగారంలో ఉద్రిక్తత..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ

నాగారంలో ఉద్రిక్తత..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ

పరకాల, వెలుగు: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫలితం రావడంతో ఆ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. 12 వార్డుల్లో 10  బీఆర్ఎస్, 2  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. తాజా మాజీ సర్పంచ్ కట్కూరి స్రవంతి, ఆమె భర్త  దేవేందర్ రెడ్డి ఎన్నో ఏండ్లుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నారని, వారికి వ్యతిరేకంగా  ఫలితాలు ఎలా వస్తాయని పార్టీ నేతలు వాదించారు.  

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకోగా ఇరువర్గాలు నినాదాలు చేయడంతో  ఉద్రిక్తత నెలకొంది.  రిజల్ట్స్ వచ్చాక చూసుకుందాం.. అంటూ ఇరువర్గాలు సవాల్ చేసుకోవడంతో పోలీసులు నచ్చజెప్పి పంపించారు. 

కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తడంతో  ఎలక్షన్ అబ్జర్వర్ శివకుమార్ నాయుడు, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఫలితం తేలేవరకు పోలింగ్ కేంద్రంలోనే ఉన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అదనపు బలగాలను మోహరించారు. కాగా నాగారం సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి ఏరుకొండ రమాదేవి ఎన్నికయ్యారు.