శాయంపేట, వెలుగు: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి ఘటనలో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారానికి చెందిన కుక్కల సారయ్య(78) మందారిపేటలోని ఓ ఆయిల్‌పామ్ తోటలో కూలీగా పనిచేస్తూ శనివారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరకాల ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.
అయినప్పటికీ డెడ్‌బాడీని గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో తరలించడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరకాల – హనుమకొండ హైవేపై ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పిటిషన్ ఇవ్వకుండా డెడ్‌బాడీని ఎలా తరలించారని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. చర్చల అనంతరం ఆందోళన విరమించారు. తన భర్త వడదెబ్బతో మృతిచెందినట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
