బెంగాల్ లో మళ్లీ ఘర్షణ.. ఇద్దరు మృతి

బెంగాల్ లో మళ్లీ ఘర్షణ.. ఇద్దరు మృతి

వెస్ట్ బెంగాల్ లో టెన్షన్ కొనసాగుతోంది. భట్ పరా ప్రాంతంలో తాజాగా జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఇటీవల చెలరేగిన ఘర్షణ వాతావరణం ఇంకా చల్లారలేదు. రాజధాని కోల్ కతా నగరానికి దగ్గర్లో ఉండే భట్ పరా ప్రాంతంలో ఈ ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. పరస్పరం నాటు బాంబులతో దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. కార్యకర్తల ఘర్షణలో ఓ చిరు వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఘర్షణలో గాయపడ్డ మరో ముగ్గురికి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కొనసాగుతోంది.

తాజా ఉద్రిక్తతలపై సీఎం మమతా బెనర్జీ హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ లో ఉంచాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ ప్రారంభించేందుకు భట్ పరా ప్రాంతానికి ఇవాళ వెస్ట్ బెంగాల్ డీజీపీ రావాల్సి ఉంది. ఐతే.. ఉద్రిక్తతల కారణంగా ఆయన పర్యటన, కార్యక్రమం రద్దయ్యాయి. భట్ పరాలో భద్రతాబలగాలను మోహరించారు.