ఎమ్మెల్యే చల్లా వర్సెస్‍ కొండా సురేఖ

ఎమ్మెల్యే చల్లా వర్సెస్‍ కొండా సురేఖ

వరంగల్‍/ఆత్మకూరు, వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‍లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపం తొలగించేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అగ్రంపహాడ్​సమ్మక్క సారలమ్మ జాతర కోసమని సొంత నిధులతో మూడెకరాలు కొనుగోలు చేసి కూతురు సుస్మిత పటేల్‍ పేరు మీద విరాళం ఇచ్చారు. కొండా మురళి తల్లిదండ్రులు చెన్నమ్మ, కొమురయ్య జ్ఞాపకార్థం ఆ స్థలంలో స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. 12 ఏండ్లుగా ఈ స్థలాన్ని జాతర సమయంలో పార్కింగ్‍, ఇతర అవసరాలకు వాడుతున్నారు.  శనివారం ఉదయం సమ్మక్క సారలమ్మ జాతర నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి హాజరై మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని పాలకవర్గాన్ని సూచిస్తూనే.. జాతర ప్రాంగణంలో ఉన్న కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపం భక్తులకు అడ్డుగా ఉందని, తొలగించాలని అధికారులకు ఆర్డర్‍ వేశారు. 'అదేం దేవుడు కాదు.. తీసెయ్‍. అది ఎవనయ్యా జాగీర్‍ అని ఇక్కడ పెట్టారంటూ' కామెంట్‍ చేశారు. జేసీబీ పెట్టి తీసేయండని లోకల్‍ లీడర్లకు పని అప్పజెప్పారు. దీంతో టీఆర్ఎస్ చౌళ్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు గడ్డపారతో దానిని ధ్వంసం చేశాడు. అక్కడే ఉన్న కాంగ్రెస్  కేడర్‍ వారిని అడ్డుకున్నారు. ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక జాతర అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.  
ధర్మారెడ్డి కూల్చే ప్రయత్నం చేసిండు
సాయంత్రం మాజీ మంత్రి కొండా సురేఖ తన కూతురు సుస్మిత పటేల్‍, పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి అగ్రంపహాడ్‍ చేరుకున్నారు. ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ అగ్రంపహాడ్‍ జాతరకు వచ్చే భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమ అత్తమామ పేరుతో మూడెకరాల భూమి కొన్నామని, ల్యాండ్‍ ఇంకా దేవాదాయశాఖకు అప్పగించలేదన్నారు. ఒరిజినల్‍ పేపర్స్​ తమ దగ్గరే ఉన్నాయని, గతంలో కూడా దానిని కూల్చే కుట్ర చేశారని, కానీ అప్పటి కలెక్టర్ హరిత ఇది ప్రైవేట్​ల్యాండ్‍ అని తేల్చి చెప్పారన్నారు. కానీ అక్రమాల ‘ధరణి పోర్టల్‍’లో దానిని ఇష్టారీతిన మార్చారన్నారు. తమ బిక్షతో పరకాలలో ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి దానిని కూల్చడానికి వచ్చాడని, వాడిని పరకాల నుంచి తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డయ్‍ అంటూ మండిపడ్డారు. పట్టా భూమిలో ఉన్న స్థూపాన్ని కూల్చినవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‍ చేశారు.