రేపటి నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు

రేపటి నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు
  • వాటర్ బాటిల్, శానిటైజర్ తెచ్చుకోవచ్చు 
  • 5 నిమిషాలకు మించి లేట్ అయితే నో ఎంట్రీ 
  • హాజరు కానున్న 5,09,275 మంది స్టూడెంట్లు  
  • రాష్ట్రవ్యాప్తంగా 2,861 సెంటర్ల ఏర్పాటు   


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్1 వరకూ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5,09,275 మంది టెన్త్ పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ, పరీక్షల విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావం ఇంకా ఉండటంతో స్టూడెంట్లు మాస్కులతోనే పరీక్షలకు అటెండ్ కావాలని స్పష్టంచేశారు. 
ఎగ్జాం సెంటర్లలోకి వాటర్ బాటిల్, శానిటైజర్ తీసుకుపోయేందుకు అనుమతిస్తున్నారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30కు ప్రారంభం కానున్నాయి. ఐదు నిమిషాలు లేట్ అయితే అనుమతిస్తామని, 9.35 తర్వాత స్టూడెంట్లను లోపలికి అనుమతించబోమని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 11,401 స్కూల్స్  నుంచి 2,58,098 మంది బాయ్స్, 2,51,177 గర్ల్స్ పరీక్షలు రాయనున్నారు. వీరిలో 1,165 ప్రైవేటు స్టూడెంట్లున్నారు. 
పరీక్షలకు 2,861 మంది సీఎస్​లు, మరో 2,861 మంది డీఓలను, 33 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. నాలుగు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీకెమెరాలు కూడా ఉంచారు. హైదరాబాద్ స్టేట్ ఆఫీసులో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏవైనా సమస్యలుంటే 040–23230942 నెంబర్​కు కాల్ చేయొచ్చని సూచించారు. 
వెబ్ సైట్​లోనూ హాల్ టికెట్లు: కృష్ణారావు 
హాల్​టికెట్లను ఈ నెల12 నుంచే వెబ్ సైట్​లో పెట్టామని, ఎవరికైనా హాల్ టికెట్లు అందకపోతే డౌన్ లోడ్ చేసుకోవాలని పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు సూచించారు. కరోనా కారణంగా ఈ ఏడాది 70% సిలబస్ తోనే క్వశ్చన్ పేపర్లు తయారుచేశామని, 11 పేపర్ల నుంచి 6కు కుదించినట్టు చెప్పారు. ఆన్సర్ షీట్లపై సంతకం, సింబల్స్, స్లోగన్స్ రాయొద్దన్నారు. పరీక్షా కేంద్రాల సిబ్బంది ఫొటో ఐడీ కార్డులతోనే రావాలని చెప్పారు.