- ఏప్రిల్16 దాకా కొనసాగనున్న పరీక్షలు
- సబ్జెక్ట్‌కు, సబ్జెక్ట్‌కు మధ్య సెలవులు..
- రివిజన్‌కు టైమ్ దొరుకుతుందన్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు డైరెక్టర్ వీపీ శ్రీహరి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.
అయితే, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11.00 వరకు ఉంటాయని వెల్లడించారు. మెయిన్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ 13తో ముగుస్తుండగా, 15,16 తేదీల్లో ఒకేషనల్ కోర్సుల పరీక్షలు కొనసాగుతాయి. అయితే, ఇదే టైమ్‌లో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి తదితర హాలీడేస్ రాగా.. మరో మూడు ఆప్షనల్ హాలీడేస్ వచ్చాయి.
దీంతో ఎప్పుడూ లేని విధంగా పరీక్షకు, పరీక్షకు మధ్యల గ్యాప్ వచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు మూడు, నాలుగు రోజులు గ్యాప్ ఉండటంతో స్టూడెంట్లకు రివిజన్ చేసుకునేందుకు టైమ్ దొరకనుందని కొందరు అంటుండగా, పిల్లల్లో భయాందోళన పెరిగే అవకాశం ఉంటుందని ఇంకొందరు చెప్తున్నారు. నెలరోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఉండడాన్ని పలు టీచర్స్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి.
కాగా, ఎలాంటి టెన్షన్, హడావుడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే 5.27 లక్షల మంది ఎగ్జామ్ ఫీజు చెల్లించగా, వారిలో 9 వేల మంది ప్రైవేట్ విద్యార్థులున్నట్టు అధికారులు తెలిపారు.

