రిజల్ట్స్​ వచ్చి నాలుగు నెలలైనా.. టెన్త్ మెమోలు ఇస్తలే

రిజల్ట్స్​ వచ్చి నాలుగు నెలలైనా.. టెన్త్ మెమోలు ఇస్తలే

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ​ఫలితాలు విడుదలై నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ స్టూడెంట్లకు మెమోలు అందలేదు. షార్ట్​ మెమోలు ఇవ్వడం నిలిపివేసిన పరీక్షల విభాగం.. లాంగ్ మెమోలనూ విద్యార్థులకు సకాలంలో అందించడం లేదు. దీంతో పలు కోర్సుల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల అండర్ టేకింగ్ ఇచ్చి, కాలేజీల్లో జాయిన్ అవుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్​ను సర్కారు పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని టీచర్లు, పేరెంట్స్ చెప్తున్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ ఫస్ట్ వీక్​లో టెన్త్ పరీక్షలు జరిగాయి. మే10న రిజల్ట్స్​ రిలీజ్ చేశారు. మొత్తం 4,84,370 మంది స్టూడెంట్లు పరీక్షలు రాయగా.. 4,19,460 మంది పాసైనట్టు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్​ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించి.. జులై 7న ఫలితాలు విడుదల చేశారు. ఇందులో 66,732 మంది పరీక్షలు రాయగా, 53,777 మంది పాసయ్యారు. సప్లిమెంటరీ ఫలితాలు వచ్చి కూడా రెండు నెలలు దాటింది. కానీ, అధికారులు ఇప్పటికీ లాంగ్ మెమోలను ప్రింటింగ్​కు కూడా ఇవ్వలేదు. దీంతో పలు టెక్నికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం స్టూడెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. 

స్కూళ్ల లాగిన్​కు పంపి చేతులు దులుపుకుంటున్నరు

తెలంగాణ రాక ముందు షార్ట్ మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రింట్ చేసి, స్టూడెంట్లకు అందించేది. కానీ, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత షార్ట్ మెమోల ప్రింటింగ్​ను నిలిపివేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు కేవలం రిజల్ట్ రోజే మార్కుల వివరాలను స్కూల్ లాగిన్​కు పంపించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాటిని స్కూల్ హెడ్మాస్టర్లు/ప్రిన్సిపల్స్​ ప్రింట్ తీసి స్టూడెంట్లకు ఇస్తున్నారు. అయితే, కొన్నిచోట్ల అడ్మిషన్లకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో, స్టూడెంట్లు అండర్ టేకింగ్ ఇస్తున్నారు. కొన్ని కాలేజీల్లో వాటిని అనుమతించకపోవడంతో కొందరు విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల విభాగానికి అప్లై చేసుకొని, వారి నుంచి అధికారంగా మెమోలు తీసుకుంటున్నారు. 

రీవాల్యుయేషన్ ఫలితాలూ లేటే..

ఫలితాలపై అనుమానమున్న స్టూడెంట్లు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కు ప్రభుత్వ పరీక్షల విభాగానికి అప్లై చేశారు. ఈ సారి 12 వేలకు పైగా స్టూడెంట్లు 22 వేలకు పైగా సబ్జెక్టులకు ఫీజు చెల్లించారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభానికి ముందే రిజల్ట్స్​ ప్రకటించాల్సి ఉన్నది. కానీ, పరీక్షలు పూర్తయిన తర్వాత స్టూడెంట్లకు ఆ ఫలితాలు ఇచ్చారు. దాదాపు రెండు నెలల దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. అప్పట్లోనూ స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

15 రోజుల్లో స్కూళ్లకు పంపుతం

టెన్త్ లాంగ్ మెమోలు త్వరలోనే ప్రింట్ చేయిస్తం. 15 రోజుల్లో స్కూళ్లకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నం. రీ వెరిఫికేషన్ ప్రక్రియతో మెమోల ప్రింటింగ్ ఆలస్యమైంది. గతంలో 11 వేల సబ్జెక్టుల వరకు రీవెరిఫికేషన్ అప్లికేషన్లు వస్తే, ఈసారి 22 వేలు వచ్చాయి. మెమోల్లో తప్పులు లేకుండా రీచెక్ చేస్తున్నాం. ఎక్కడైనా స్టూడెంట్ల అడ్మిషన్లకు ఇబ్బందులు తలెత్తితే, మెమో ఆఫ్ మార్కు పేరుతో బోర్డుకు అప్లై చేస్తే, అధికారుల సంతకాలతో మెమో ఇస్తం.
-
కృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్