సెంట్‌‌‌‌ బాటిల్‌‌‌‌ విషయంలో గొడవ.. విచక్షణారహితంగా గురుకుల విద్యార్థుల దాడి

సెంట్‌‌‌‌ బాటిల్‌‌‌‌ విషయంలో గొడవ.. విచక్షణారహితంగా  గురుకుల విద్యార్థుల దాడి

తూప్రాన్, వెలుగు : సెంట్‌‌‌‌ బాటిల్‌‌‌‌ విషయంలో గొడవ జరగడంతో టెన్త్‌‌‌‌ స్టూడెంట్లు 9వ తరగతి విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన మెదక్‌‌‌‌ జిల్లా తూప్రాన్‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని టోల్‌‌‌‌గేట్‌‌‌‌ వద్ద ఉన్న బాలుర గురుకుల స్కూల్‌‌‌‌లో ఆదివారం జరిగింది. రాత్రి భోజనం చేసిన తర్వాత టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ జశ్వంత్‌‌‌‌, 9వ తరగతి స్టూడెంట్లు నిశాంత్‌‌‌‌, అభినవ్‌‌‌‌, బలరాం మధ్య సెంట్‌‌‌‌ బాటిల్‌‌‌‌ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు కలిసి జశ్వంత్‌‌‌‌ను నెట్టివేశారు. దీంతో జశ్వంత్‌‌‌‌ తన ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి ముగ్గురిని డార్మెటరీ రూమ్‌‌‌‌కు తీసుకెళ్లారు. 

అక్కడ టెన్త్‌‌‌‌ స్టూడెంట్లు 10 మంది కలిసి 9వ తరగతి స్టూడెంట్లపై మూకుమ్మడిగా దాడి చేశారు. వారు అరిచేందుకు ప్రయత్నించడంతో నోట్లో దుస్తులు కుక్కి, బ్యాండ్‌‌‌‌ కొట్టేందుకు వినియోగించే కర్రలతో దాడి చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. గాయపడిన స్టూడెంట్లు సోమవారం ఉదయం పేరెంట్స్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. స్కూల్‌‌‌‌ వద్దకు చేరుకున్న పేరెంట్స్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌తోపాటు, టీచర్లతో గొడవకు దిగారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం, తమకు సమాచారం ఇవ్వకపోవడంపై నిలదీశారు. 

స్పందించిన ప్రిన్సిపాల్‌‌‌‌ మురళి దాడి చేసిన స్టూడెంట్లను సస్పెండ్‌‌‌‌ చేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. గాయపడిన స్టూడెంట్లను పేరెంట్స్‌‌‌‌ వారి ఇండ్లకు తీసుకెళ్లారు. నెల రోజుల కిందే ఇలాంటిదే ఓ ఘటన జరుగగా, ఇప్పుడు మరోసారి గొడవ జరగడంతో స్టూడెంట్స్,పేరెంట్స్‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేరెంట్స్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.