జైషే చీఫ్​ ఫ్యామిలీ హతం..నలుగురు అనుచరులు సహా 14 మంది మృతి

జైషే చీఫ్​ ఫ్యామిలీ హతం..నలుగురు అనుచరులు సహా 14 మంది మృతి
  • మీడియాకు వెల్లడించిన టెర్రర్ సంస్థ చీఫ్ మసూద్​ అజార్​

న్యూఢిల్లీ: ‘ఆపరేషన్​ సిందూర్’​లో జైషే చీఫ్​ మౌలానా మసూద్​ అజార్​కు షాక్ తగిలింది. అజార్​కుటుంబ సభ్యులు10 మంది, మరో నలుగురు అనుచరులు మరణించారు. ఈ విషయాన్ని మసూద్ అజార్ మీడియాకు వెల్లడించాడు. భారత్ దాడుల్లో తన సోదరి, బావ, మేనల్లుడు, అతడి భార్యతో పాటు మరో ఐదుగురు పిల్లలు మృతిచెందినట్టు మసూద్ అజార్ చెప్పాడు. 

జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం బహవల్​పుర్​లోని జామియా మసీద్​​ సుబాన్​ అల్లాహ్​ ప్రాంతంలో జరిగిన దాడిలో వీరందరూ మరణించినట్టు తెలిపాడు. “నా కుటుంబంలోని 10 మంది సభ్యులు మరణించారు. ఐదుగురు అమాయక పిల్లలు చనిపోయారు. నా అక్క సాహిబా, నా ప్రాణం కంటే ప్రియమైనది, ఆమె భర్త.. నా మేనల్లుడు అలీమ్ ఫాజిల్, అతని భార్య, నా ప్రియమైన మేనకోడలు ఆలం ఫాజిలా, నా మేనల్లుడు, అతని భార్య అల్లాహ్ కు ప్రియమైనవారు అయ్యారు” అని మసూద్‌‌ పేర్కొన్నాడు. 

నిరాశ లేదు.. విచారం చెందను

భారత్​ చేసిన దాడిలో  కుటుంభ సభ్యులు మరణించడంపై తనకు నిరాశ లేదని, విచారం చెందనని మసూద్​ అజార్​ వ్యాఖ్యానించాడు. “అమాయక పిల్లలను, మహిళలను, వృద్ధులను మోదీ లక్ష్యంగా చేసుకున్నారు. నేను కూడా మరణించిన వారిలో ఉండాల్సిందని నాకు పదే పదే గుర్తుకు వస్తున్నది. కానీ అల్లాను కలిసే సమయం ఇంకా రాలేదు” అని పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులు, అనుచరుల అంత్యక్రియల్లో పాల్గొనాలని  ప్రజలను ఆహ్వానించాడు. 

మసూద్​ అజార్​ ఇంటర్నేషనల్​ టెర్రరిస్ట్​

56  ఏండ్ల మసూద్​ అజార్ ను​ యునైటెడ్​ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్​ ఇంటర్నేషనల్​ టెర్రరిస్ట్​గా ప్రకటించింది. 2001 పార్లమెంట్​పై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడితో సహా భారత్​లో జరిగిన అనేక ఉగ్ర దాడుల వెనుక అజార్​ హస్తం ఉన్నది. అజార్​ పాకిస్తాన్‌‌లో ఉన్నాడనేది బహిరంగ రహస్యమే అయినప్పటికీ, అతని గురించి సమాచారం లేదని పాకిస్తాన్​ పదేపదే బుకాయిస్తోంది.