- మృతుల్లో ఒక డాక్టర్, ఐదుగురు వలస కార్మికులు
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని గందర్ బాల్ జిల్లా గగాంగిర్ వద్ద టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఒక డాక్టర్, ఐదుగురు వలస కార్మికులు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం గుండ్ ప్రాంతంలో సొరంగాన్ని నిర్మించే పనిలో కార్మికులు ఉండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ అటాక్ లో ఇద్దరు స్పాట్ లోనే చనిపోగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. టెర్రరిస్టులను గుర్తించేందుకు పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు.
ఈ ఘటనపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ..‘‘టెర్రరిస్టులది పిరికి చర్య. ముష్కరుల దాడిలో గాయపడిన వారిలో స్థానికులతో పాటు స్థానికేతరులు కూడా ఉన్నారు. వారిని శ్రీనగర్ స్కిమ్స్ కు తరలించాం. బాధితులు పూర్తిగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద భారీ పేలుడుదేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ఏరియా ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ స్కూల్వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతోపాటు ఫోరెన్సిక్, బాంబు డిస్పోజల్ సిబ్బంది సంఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, స్కూల్ గోడతోపాటు కొన్ని కార్లు ధ్వంసమయ్యాయని పోలీసులు వెల్లడించారు. బ్లాస్ట్ వల్ల పరిసరాల్లో భారీగా పొగ కమ్ముకుందని, దుర్వాసన వచ్చిందని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై కుట్రకోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.