
- బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ వెల్లడి
- ఎన్‌పీఏలో 174 మంది ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలు, టెక్నాలజీ వార్‌తో పాటు ఉగ్రవాదం, నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌధరి అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు భుజం భుజం కలిపి పనిచేశాయని ఆయన తెలిపారు. రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ ఆర్ఆర్ (2024) ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి దల్జిత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫస్ట్ ఫేస్ శిక్షణ పూర్తి చేసుకున్న 174 మంది ఐపీఎస్‌లు, నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన 16 మంది సహా మొత్తం 190 మంది ప్రొబెషనరీ పోలీస్ ఆఫీసర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాపర్ అంజిత్ ఎ.నాయర్‌కు డైరెక్టర్స్ ట్రోఫీ సహా మొత్తం 9 మందికి ట్రోఫీలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం పరివర్తనాత్మక మార్పు చెందుతోందని, అదే సమయంలో ఐపీఎస్ అధికారుల ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు.