గుట్టపై నుంచి జవాన్లపై అటాక్

గుట్టపై నుంచి జవాన్లపై అటాక్

పూంచ్/జమ్మూ: పూంచ్ జిల్లాలో ఆర్మీ వెహికల్స్​పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. గుట్టపై నుంచి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రమాదకరమైన మూలమలుపు వద్ద దాడి చేశారని వివరించారు. అటాక్​కు ముందు గుట్ట చుట్టు పక్క ప్రాంతాల్లో టెర్రరిస్టులు రెక్కీ చేసినట్లు తెలిపారు. పూంచ్ జిల్లాలోని ధేరా కి గాలి, బుఫ్లియాజ్‌‌ మధ్య ఉన్న ధత్యార్‌‌ మోర్‌‌ వద్ద గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు దాడి చేసినట్లు తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు టెర్రరిస్టులు దాడికి పాల్పడి ఉంటారని  చెప్పారు. జవాన్లు చనిపోయాక 
వారి వెపన్స్ ఎత్తుకెళ్లినట్లు వివరించారు.

టెర్రరిస్టుల కోసం ఆర్మీ వేట

టెర్రరిస్టుల కోసం అడవిని జల్లెడపడుతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎన్ఐఏ టీమ్ పరిశీలించింది. హెలికాప్టర్లను రంగంలోకి దించారు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సాయంతో టెర్రరిస్టుల కోసం వెతుకుతున్నారు. అదనపు బలగాల సాయంతో చుట్టుపక్క ప్రాంతాల్లో సెర్చింగ్ చేస్తున్నారు.

దాడి చేసింది మేమే: పీఏఎఫ్ఎఫ్

పూంచ్ జిల్లాలో ఆర్మీ వెహికల్స్​పై దాడి చేసింది తామే అని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ శుక్రవారం ప్రకటించింది. దాడులకు తెగబడుతున్న టైమ్​లో తీసిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అమెరికాలో తయారైన ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్స్ ను టెర్రరిస్టులు ఉపయోగించినట్టు ఫొటోల ద్వారా స్పష్టమవుతున్నది.  

బాడీ కెమెరాలతో రికార్డింగ్

గతంలో కూడా టెర్రరిస్టుల వద్ద నుంచి ఈ తరహా మోడ్రన్ వెపన్స్​ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లష్కరే తాయిబాకి కంటే ముందు నుంచి పీఏఎఫ్ఎఫ్ ఉన్నది. 2019, ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేశాక మొదటిసారి పీఏఎఫ్ఎఫ్ దాడులపై ప్రకటన చేసింది.

కాశ్మీరీ టెర్రరిస్టులతో పన్నూకు లింక్​లు!

కాశ్మీర్​కు చెందిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్​తో ఖలిస్తాని టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ చేతులు కలిపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. పన్నూ తనను తాను కాశ్మీర్, ఖలిస్తాని రెఫరెండం ఫ్రంట్ ప్రతినిధిగా ప్రకటించుకున్నాడు. కాశ్మీరీలను ఇండియా హింసిస్తున్నదని, దానికి ప్రతీకారమే జవాన్లపై దాడి అని చెప్పాడు. కాశ్మీరీ స్వాతంత్ర్య సమరయోధుల చేతిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పన్నూ కామెంట్​ చేశాడు.