
ఒక్క ‘ఆలోచన’ ప్రపంచానికి మనశ్శాంతి లేకుండా చేయగలదు. ఒక్క ఆలోచన అదే ప్రపంచాన్ని సుఖసంతోషాలతో నింపగలదు. ఒక్క ఆలోచన అశాంతిని పేట్రేగేలా చేసి, నిరంతరం రావణకాష్టంలా రగిలించనూగలదు. అలాంటి ఆలోచనల్లో ఒకటే టెర్రరిజం. ఇస్లాం ప్రపంచాన్ని తయారు చేసి, షరియాతో దాన్ని పరిపాలించడమే ఇస్లాం లక్ష్యం. ఇందుకోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా టెర్రరిస్టులు వెనకాడటం లేదు. గుడి, బడి, చర్చి ఇలా ప్రాంతమేదైనా లెక్కచేయకుండా టెర్రర్ ఎటాక్స్ చేస్తూనే ఉన్నారు. ప్రపంచదేశాలన్నీ కలిసి ఏకమై టెర్రరిజంపై ఉక్కుపాదం మోపుతున్నా.. ఏదో ఒక మూల నుంచి ఉగ్ర రాకాసి విరుచుకుపడుతూనే ఉంది.
ఏ తప్పు చేయని ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా తుపాకీ గుళ్లకో, కత్తి పోట్లతోనే, తనను తాను పేల్చుకునో టెర్రరిస్టులు బలి తీసుకుంటున్నారు. అసలు వ్యక్తులు టెర్రరిస్టులుగా ఎలా మారతారు? వాళ్ల మెదడు నిరంతరం దేని గురించి ఆలోచిస్తుంది? కనికరం అనే పదానికి టెర్రరిస్టుల మెదడులో చోటు ఉందా? ప్రేమ అనే మాట ఆ తడి ఆరిన హృదయాలకు తెలుసా? ఇవే ప్రశ్నలు ఆర్టిస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు చెందిన సైంటిస్టులను వేధించాయి. సిరియా వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ (ఐసిస్)లో చేరాలనుకుంటున్న కొందరు వ్యక్తులను కలిశారు. వాళ్లతో మాట్లాడి ‘బ్రెయిన్ స్కాన్’ చేస్తామని అడిగారు. స్కాన్ చేసి సాధారణ వ్యక్తులకు, వారికి మధ్య ఉన్న తేడాను చెప్పాలని అడిగారు. సైంటిస్టులు బ్రెయిన్ స్కాన్స్ చేసిన రాడికలిస్టుల్లో అల్ ఖైదాకు మద్దతు తెలిపే అహ్మద్(31), ఐసిస్‌లో చేరాలని ఉవ్విళ్లూరుతున్న యాస్సినీ(20) ఉన్నారు. పాకిస్థాన్‌కు అహ్మద్ వలస వచ్చాడు. యాస్సినీ స్పెయిన్‌కు చెందిన వ్యక్తి. 2014 నుంచి 2017 మధ్య వీళ్లిద్దరికీ సైంటిస్టులు పలుమార్లు బ్రెయిన్ స్కాన్స్ నిర్వహించారు. వాటిలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
పవిత్ర విలువలు
ప్రతి వ్యక్తికి విలువలు ఉంటాయి. అవి మంచి, చెడుల సమాహారం కూడా కావొచ్చు. కేవలం మతానికి సంబంధించిన విలువలే పవిత్రమైనవి కాదనేది ఇక్కడ సైంటిస్టులు చెప్పదలుచుకున్న మాట. యూరప్ లోని స్పెయిన్‌లో అత్యధికంగా టెర్రరిజానికి ఆకర్షితులవుతున్న యువత ఉన్నారు. ఇక్కడి బార్సిలోనాలో ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో మూడేళ్ల పాటు తిరిగిన సైంటిస్టుల టీమ్ 535 సర్వేలు చేసింది. దాదాపు 38 మంది కరుడు గట్టిన ఉగ్రవాద భావజాలం కలిగిన వారిని బ్రెయిన్ స్కాన్స్ కోసం ఎన్నుకుంది. వీరిలో స్పెయిన్ జాతికి చెందిన వాళ్లు, మొరాకన్ సంతతి వాళ్లు ఉన్నారు. బ్రెయిన్ స్కాన్స్ చేస్తున్నామనే విషయం వాళ్లకు చెప్పకుండా, కంప్యూటర్లలో ‘సైబర్ బాల్’ గేమ్ ఆడాలని సైంటిస్టులు వాళ్లను అడిగారు. కొద్ది నిమిషాల పాటు మామూలుగా సాగిన గేమ్ లో ఒక్కసారిగా అతి పెద్ద మార్పు వచ్చింది. మొరాకన్ యూత్ కేవలం ఇతర మొరాకన్లకు, స్పెయిన్ యూత్ కేవలం స్పెయినీయులకు మాత్రమే బాల్‌ను పాస్ చేయడం మొదలుపెట్టారు. వెంటనే గేమ్‌ను ఆపించి బ్రెయిన్ యాక్టివీటిని తెలుసుకునేందుకు అందరికీ ఫంక్షనల్ మ్యాగ్నటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్(ఎఫ్ఎమ్ఆర్ఐ) స్కాన్ చేశారు. వాటిలో వాళ్లకున్న ‘పవిత్ర విలువలు’ కోసం ఎందాకైనా పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధంగా ఉన్నారని తేలింది.
రాతి గుండెను కరిగించొచ్చు!
టెర్రర్ భావజాలానికి ఆకర్షితులైన పాకిస్థాన్ కు చెందిన 146 మందికి, బార్సిలోనాకు చెందిన 30 మందికి సైంటిస్టులు సెకండ్ న్యూరో ఇమేజింగ్ స్టడీ నిర్వహించారు. తొలుత పవిత్ర విలువలు, మామూలు సూత్రాల కోసం వాళ్లు ఎంతలా తపన పడుతున్నారో గుర్తించారు. పాకిస్థానీలో ఒకలా, మొరాకన్ సంతతికి చెందిన వారు మరోలా స్పందించారు. ఈ అంచనాలు వేస్తున్నప్పుడు పాకిస్థానీల మెదడులోని డోర్సోలేటరల్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్(డీఎల్పీఎఫ్సీ) బాగా పని చేసింది. పవిత్ర విలువ కోసం వాళ్లు ప్రాణ త్యాగానికైనా వెనుకాడరని సైంటిస్టులకు అర్థమైంది. మరోవైపు మెదడులోని వెంట్రోమీడియల్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్(వీఎంపీఎఫ్ సీ) కూడా యాక్టివేట్ అయింది. ఇది ఓ ఏ సబ్జెక్టుపై మనిషి ఆలోచిస్తున్నాడో చెబుతుంది. అంతేకాకుండా అతడు దాని కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో వివరిస్తుంది. ఓ వ్యక్తి రోజూ వారీ నిర్ణయాల్లో డీఎల్పీఎఫ్సీ, వీఎంపీఎఫ్సీ కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, వీఎంపీఎఫ్సీని ప్రభావితం చేయగలిగితే కఠినమైన వాళ్ల మనసు కరిగించొచ్చని చెప్పారు.