శ్రీనగర్: జమ్మూలోని కథువా జిల్లా బాడ్ నోటా గ్రామంలో ఆర్మీ కాన్వాయ్ పై దొంగదెబ్బ తీసి ఐదుగురిని హత్య చేసిన పాకిస్తానీ టెర్రరిస్టులు.. ఘటనకు ముందు గ్రామస్థులతో బలవంతంగా వంట వండించుకున్నారు. వారికి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకులు చూపించి వంటలు చేయించుకున్నారు. ఆర్మీ సైనికులపై దాడికి పాల్పడే ముందు ఘటనా స్థలాన్ని కొద్ది రోజుల పాటు స్థానికుల సాయంతో ముష్కరులు రెక్కీ చేశారు. బాడీ కెమెరాలు వేసుకొని జవాన్లపై దాడికి దిగారు. అంతేకాకుండా జవాన్ల ఆయుధాలు లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు.
జవాన్లు గాయపడినా తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆయుధాలు వదిలి పరారయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. ‘‘దాడి జరిగిన ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ చాలా తక్కువ. అంతేకాకుండా బాడ్ నోటా గ్రామం ఆర్మీ పోస్టుకు చాలా దూరంలో ఉంది. టెర్రరిస్టులు ఎత్తైన ప్రాంతం నుంచి దాడికి తెగబడ్డారు” అని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 20 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
