- విద్యాశాఖ, గురుకులాల నుంచి వచ్చిన
- రూ.250 కోట్ల చేనేత ఆర్డర్లు ఆకస్మికంగా రద్దు
- టెస్కో నుంచి చేనేత సొసైటీలకు అందిన లెటర్లు
- పీఎంయూ ద్వారా కొనుగోళ్లకు తాజాగా సర్కారు టెండర్లు
- లక్ష కుటుంబాల జీవనోపాధిపై ఎఫెక్ట్
- ఇప్పటికే తయారైన క్లాత్‌ను ఏం చేయాలని సొసైటీల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని చేనేత సొసైటీలకు విద్యాశాఖ, గురుకులాల నుంచి వచ్చిన రూ. 250 కోట్ల విలువైన ఆర్డర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎంయూ) ద్వారా మళ్లీ ఓపెన్ టెండర్లను ఆహ్వానించింది. మగ్గాలపై వస్త్రం సగం తయారై ఉండగానే ఆర్డర్లు వద్దంటున్నారని కార్మికులు, ఆసాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2026–27 విద్యా సంవత్సరం కోసం విద్యాశాఖ, గురుకులాల నుంచి తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (టెస్కో) సంస్థకు భారీ ఇండెంట్ అందింది.
స్కూల్ యూనిఫామ్‌ల కోసం రెండున్నర కోట్ల మీటర్ల క్లాత్ కావాలని ఆయా సంస్థలు కోరాయి. దీంతోపాటు హాస్టల్ విద్యార్థుల కోసం బ్లాంకెట్లు, బెడ్ షీట్లు, కార్పెట్లు, టవల్స్ కావాలని అధికారులు ఆర్డర్ ఇచ్చారు. ఈ ఇండెంట్ ఆధారంగానే టెస్కో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 400 చేనేత సహకార సంఘాలకు కాంట్రాక్టులు అప్పగించింది.
దీంతో వేల సంఖ్యలో మగ్గాలు, పవర్ లూమ్మిషన్లు పని ప్రారంభించాయి. చేనేత సొసైటీలన్నీ వస్త్రం తయారీలో నిమగ్నమయ్యాయి. ఏప్రిల్, మే నెలాఖరు కల్లా క్లాత్‌ను డెలివరీ చేయాల్సి ఉంది. ఈ సమయంలో సడెన్‌గా గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేసుకుంటున్నామని ఆయా శాఖల నుంచి టెస్కోకు లేఖ అందించింది. దీంతో అధికారుల్లోనూ అయోమయం నెలకొన్నది.
దిక్కుతోచని స్థితిలో సొసైటీలు..
ప్రస్తుతం సొసైటీల వద్ద వస్త్రం నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పటికే తయారైన క్లాత్‌ను ఏం చేయాలి?.. చేసిన అప్పులు ఎలా తీర్చాలి?.. అని సొసైటీల ప్రతినిధులు, ఆసాములు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహమూబ్ నగర్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఎక్కువగా చేనేత కార్మికులున్నారు. ఇప్పటికే వందలాది సొసైటీలు మూతపడుతున్నాయి.
అయితే, లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పించే ఈ ఆర్డర్లను రద్దు చేస్తే ఎలా అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన సొసైటీల ప్రతినిధులు ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి.. తమ సమస్యను వివరించారు. మరోపక్క ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఈ విషయంలో టెస్కో అధికారులూ అయోమయంలో ఉన్నారు. గతంలో ఇచ్చిన ఇండెంట్ ప్రకారం క్లాత్ రెడీగా ఉందని, ఇప్పుడు వాటిని తీసుకోకపోతే ఉత్పన్నమయ్యే పరిణామాలపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పాత ఇండెంట్ ప్రకారం వస్త్రాన్ని సేకరించి తమను ఆదుకోవాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
పని లేక పస్తులుండే పరిస్థితి
సమగ్ర శిక్ష ద్వారా ఇచ్చిన క్లాత్ ఆర్డర్ రద్దు చేయడంతో మాకు పని లేకుండా పోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నెలకు రూ. 25 వేల వరకు వచ్చేది. కానీ ఇప్పుడు సమగ్ర శిక్ష ఆర్డర్ క్లాత్ ఉత్పత్తిని రద్దు చేస్తామంటున్నారు. ఒకవేళ ఈ ఆర్డర్లను రద్దు చేస్తే మేం పూర్తిగా ఉపాధి కోల్పోతాం. అప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టమవుతుంది. పని చేస్తే తప్ప మా కడుపు నిండదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నేత కార్మికులను ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.
– మామిడాల శ్రీనివాస్, నేత కార్మికుడు, సిరిసిల్ల
టెస్కో ద్వారా కొనాలె
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆర్డర్లు ఇచ్చింది. క్లాత్ ఉత్పత్తి చేయడానికి యారన్ కూడా నేతన్నలకు సమకూర్చింది. నేను 65 వేల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ తీసుకున్నా. ఇప్పటివరకూ 4 వేల మీటర్ల క్లాత్‌ను ఉత్పత్తి చేశా. ఉన్నట్టుండి ప్రభుత్వం క్లాత్ ఆర్డర్లు రద్దు చేయడంతో మేమంతా షాక్ అయ్యాం.
క్లాత్ ఆర్డర్ పట్టుకున్న ఆసాములు ఉత్పత్తి చేసిన వస్త్రం కొనుగోలు చేయకుంటే నేతన్నల పరిస్థితి ఏమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలి. యూనిఫామ్ ఆర్డర్లు రద్దు చేయడం మూలంగా సిరిసిల్లలో నేత కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం వెంటనే టెండర్లు రద్దుచేసి ఉత్పత్తి చేసిన యూనిఫామ్ క్లాత్‌ను గతంలో లాగానే టెస్కో ద్వారా కొనుగోలు చేయాలి.
–అన్నాల్దాస్ అనిల్, టెక్స్టైల్ పార్క్ క్లాత్ మాన్యుఫాక్చరింగ్ ప్రెసిడెంట్
