ట్రిబ్యునల్లో ఖాళీల భర్తీపై సుప్రీం సీరియస్

ట్రిబ్యునల్లో ఖాళీల భర్తీపై సుప్రీం సీరియస్

దేశ వ్యాప్తంగా వివిధ ట్రిబ్యునల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాలు, నిర్ణయాలంటే గౌరవం లేనట్టుగా అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. తమ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంది. నియామకాలు చేయడం.. లేకపోతే ట్రిబ్యునల్ మూసివేయడం.. చివరగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడమే తమకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయని ధర్మాసనం కామెంట్ చేసింది. ట్రిబ్యునల్ కొనసాగాలని కోరుకోవడం లేదా.. అని సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించారు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ. దీంతో.. ధర్మాసనం అభిప్రాయాలను ప్రభుత్వానికి వివరిస్తానని సొలిసిటర్ జనరల్ కేంద్రానికి చెప్పారు. అయితే.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కాదు.. వెంటనే నియామకాలు చేపట్టేలా చర్యలు చేపట్టాలంది ధర్మాసనం. వచ్చే సోమవారం నాటికి నియామకాలు పూర్తిచేయాలని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం దేశంలో.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, ఇన్ కంట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ తో పాటు పలు ట్రిబ్యునల్స్ లో మొత్తం 240 ఖాళీలున్నాయి. వీటిపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది.