
- జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహణ
- అటెండ్ కానున్న 2.86 లక్షల మంది
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 2 వరకూ జరిగే ఈ ఎగ్జామ్స్.. ప్రతి రోజూ రెండు సెషన్లలో చేపట్టనున్నారు. ఉదయం 9గంటల నుంచి 11.30 గంటలవరకూ ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30గంటల వరకూ సెకండ్ సెషన్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో 99,958 మంది పేపర్-1, 1,86,428 మంది పేపర్-2 రాయనున్నారు. ఇందులో 48,582 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా16 జిల్లాల్లో 80 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చెల్‌లో 25, రంగారెడ్డి జిల్లాలో 17 ఎగ్జామ్ సెంటర్లున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు ఆరు రోజులు పేపర్ 2 ఎగ్జామ్ జరగనున్నది.
వీటిలోనూ 20, 21, 22 తేదీల్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్‌కు, 24, 28, 29 తేదీల్లో సోషల్ స్టడీస్ పేపర్‌కు ఎగ్జామ్ ఉంటుంది. దీంతో పాటు మే 30 నుంచి జూన్ 2 వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు టెట్ పేపర్ 1 ఎగ్జామ్ జరగనున్నది. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో మైనర్ మీడియం అభ్యర్థులకు జూన్ 1న మార్నింగ్ సెషన్‌లో.. పేపర్ 1 మైనర్ మీడియం అభ్యర్థులకు మధ్యాహ్నం సెషన్‌లో ఎగ్జామ్ ఉంటుంది.
గంటన్నర ముందే అనుమతి...
రాష్ట్రంలో తొలిసారిగా ఆన్ లైన్ లో టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్ లైన్ ఎగ్జామ్స్ కావడంతో నిర్దిష్ట సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ గేట్లు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. కాబట్టి కనీసం గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. అభ్యర్థులు కేవలం హాల్ టికెట్, పెన్ను తో పాటు ఏదైనా ఒక ఫొటో ఐడెంటీ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని కోరారు.